Nitin Gadkari | వచ్చే ఐదేండ్లలో భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇప్పటి వరకూ దేశీయ ఆటోమొబైల్ రంగం 4.5 కోట్ల ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఫాడా) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత ఆటోమొబైల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. ‘భారత ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే ఐదేండ్లలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని నేను విశ్వాసంతో ఉన్నాను’ అని చెప్పారు.
ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ రూ.78 లక్షల కోట్లు, చైనా ఆటోమొబైల్ రంగం రూ.47 లక్షల కోట్లు, భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రూ.22 లక్షల కోట్ల విలువ కలిగి ఉంది. 2014లో కేంద్ర రవాణాశాఖ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.7.5లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆటోమొబైల్ రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ రూపంలో అధిక ఆదాయం లభిస్తుందన్నారు. దేశంలో తయారవుతున్న ద్విచక్ర వాహనాల్లో సగం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు.