Malaysia – India | భారతీయులకు మలేషియా ప్రభుత్వం మరో రెండేండ్ల పాటు వీసా మినహాయింపు కల్పించింది. 2026 డిసెంబర్ 31 వరకూ వీసా లేకుండా మలేషియాలో 30 రోజులు ప్రయాణించవచ్చు. 2025 ఏషియన్ చాంపియన్ షిప్ చైర్మన్ షిప్ మలేషియాకు రానున్నది. ఈ నేపథ్యంలో మలేషియాలో పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవచ్చునని మలేషియా హోంశాఖ సెక్రటరీ జనరల్ దాటుక్ అవాంగ్ అల్లిక్ జెమాన్ తెలిపారు. పర్యాటక రంగం విస్తరణ, ఆర్థిక వృద్ధి ఉద్దీపనకు తొలుత 2023 లో మలేషియా వీసా మినహాయింపు ప్రక్రియ ప్రారంభించింది. చైనా పౌరులకు కూడా వీసా మినహాయింపునిచ్చింది మలేషియా. తద్వారా తమ దేశంలోని కీలక కేంద్రాలకు మరింత పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం కోల్ కతా – కౌలాలంపూర్ మధ్య రెండు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 2023 డిసెంబర్ ఒకటో వీసా మినహాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. 30 రోజులకు రిటర్న్ టికెట్, అక్కడ బస చేయడానికి అవసరమైన నిధులు (బ్యాంకు స్టేట్ మెంట్ లేదా క్రెడిట్ కార్డులు) చూపాల్సి ఉంటుంది. మలేషియా పర్యాటక రంగానికి భారత ప్రయానికులు చాలా కీలకం.
కరోనాకు ముందు 2019లో 7.35 లక్షల మంది భారతీయులు మలేషియాలో పర్యటించారు. వీసా మినహాయింపు తర్వాత క్రమంగా భారతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది మలేసియాలో పర్యటించిన భారతీయుల సంఖ్య పది లక్షల మందిని దాటింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకూ 10,09,114 మంది భారతీయ పర్యాటకులు మలేషియాలో పర్యటించారు. 2023లో 5,83,703 మంది పర్యటించారు. 2019తో పోలిస్తే 47 శాతం, గతేడాదితో పోలిస్తే 71.7 శాతం మంది భారతీయ పర్యాటకులు పెరిగారు.