ముంబై, సెప్టెంబర్ 4 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత నాలుగు రోజులుగా నష్టపోయిన సూచీలకు మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లోకి రాగలిగాయి. ఒక దశలో 700 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 362 పాయింట్లు అందుకొని 76,515.43 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 24.25 పాయింట్లు అందుకొని 23,897.70 వద్ద స్థిరపడింది. సూచీల్లో టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
కానీ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ఫార్మాస్యూటికల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతి సుజుకీ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా మెటల్ సూచీ అత్యధికంగా 1.42 శాతం లాభపడగా, హౌజింగ్ ఫైనాన్స్ 1.41 శాతం, టెలికమ్యూనికేషన్ 1.39 శాతం, బీమా 1.37 శాతం, కమోడిటీస్, ఆర్థిక సేవలు, ప్రైవేట్ బ్యాంకింగ్, సర్వీసెస్, యుటిలిటీస్ సూచీలు లాభపడ్డాయి. మరోవైపు, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ నష్టపోయాయి. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 749 పాయింట్లు, నిఫ్టీ 278 పాయింట్లు నష్టపోయాయి.
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఆగస్టు 28తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 740.803 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం వారంతో పోలిస్తే 11.475 బిలియన్ డాలర్లు పెరిగినట్టు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.