ముంబై, అక్టోబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. మెటల్, వాహన, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో మంగళవారం కూడా సూచీలు పతనం చెందాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలును నష్టాలను మరింత పెంచాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 297 పాయింట్లు కోల్పోయి 82,029.98 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 81.85 పాయింట్లు నష్టపోయి 25,145.50 వద్ద స్థిరపడింది.
గ్లోబల్ మార్కెట్లు నష్టపోవడం, వాణిజ్యానికి సంబంధించిన ఆందోళనలు నెలకొనడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. వీటికితోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవడం కూడా నష్టాలకు ఆజ్యంపోశాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో బజాజ్ ఫైనాన్స్ 1.8 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టాటా మోటర్స్, టీసీఎస్, టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పతనం చెందాయి. కానీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిస్టింగ్ రోజే దుమ్మురేపింది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయినప్పటికీ ఎల్జీ తన లిస్టింగ్ రోజు షేరు ధర 50 శాతం వరకు లాభపడింది. ఇష్యూ ధర రూ. 1,140తో పోలిస్తే 48 శాతం ఎగబాకింది. ఇంట్రాడేలో 50.43 శాతం ఎగబాకి రూ.1,715కి చేరుకున్న షేరు ధర చివరకు 48 శాతం అధికమై రూ.1,689.40 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈలోనూ 48.23 శాతం బలపడి రూ.1,689.90 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,14,671.81 కోట్లుగా నమోదైంది.