Rupee | ముంబై, జనవరి 16: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. రికార్డు స్థాయిల నుంచి కోలుకున్నట్టే కనిపించినా.. గురువారం నష్టాలకే పరిమితమైంది. 21 పైసలు పడిపోయి 86.61కి చేరింది. అంతకుముందు రెండు రోజులు 30 పైసలు పెరిగిన విషయం తెలిసిందే.
ఇక సోమవారం ఒక్కరోజే 66 పైసలు పతనమై మునుపెన్నడూ లేనివిధంగా 86.70గా నమోదైన సంగతి విదితమే. కాగా, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగబాకడం, విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతుండటం వంటివి రూపాయిని కూలదోశాయి.