ముంబై, డిసెంబర్ 3 : రూపాయి మరింత ఢీలాపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఇప్పటికే 90 స్థాయికి పడిపోయిన విలువ బుధవారం మరో 19 పైసలు కోల్పోయి ఆల్‌టైం హైకి 90.15కి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ఇంట్రాడేలో 25 పైసలు జారుకున్న విలువను కట్టిడి చేయడానికి రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగడంతో ఈ భారీ నష్టాలను తగ్గించగలిగిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. బుధవారం ఉదయం 89.96 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 90.30 స్థాయికి పతనమైంది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 19 పైసలు తగ్గి 90.15కి జారుకున్నది. మంగళవారం రూపాయి విలువ 43 పైసలు కోల్పోయి 89.96కి పడిపోయిన విషయం తెలిసిందే. దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ నెలకొనడం రూపాయి పతనానికి ఆజ్యంపోసిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 శాతం పతనం చెందింది.
అంతర్జాతీయంగా అన్ని కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు గురవుతున్నాయని, ఇదే క్రమంలో రూపాయి పతనం చెందింది తప్పా..బలహీనమైన కరెన్సీ మాత్రం కాదని ఎస్బీఐ ఎకానమిక్ రీసర్చ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈవారంలోనే వడ్డీరేట్ల తగ్గింపుపై రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోనుండటం కూడా రూపాయి పతనానికి బ్రేక్ వేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. స్వల్పకాలంలో డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 89.90 నుంచి 91.20 మధ్యలో నమోదుకానున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,206 కోట్ల షేర్లను విక్రయించడం కూడా రూపాయి పతనానికి ఆజ్యంపోసింది. దేశీయ ఎగుమతులు నీరసించడం, వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన నెలకొనడం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనన నెలకొన్నది.
రూపాయి పతనంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. చమురు బిల్లుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావచ్చునని అంటున్నారు. ముఖ్యంగా దేశీయ వినిమయంలో 80 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ఇది పెద్దదెబ్బేనని వారు అంటున్నారు.
రూపాయి పతనంపై ప్రభుత్వం ఎలాంటి ఆందోళన చెందడం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ అన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90 స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. రూపీ పతనంతో ద్రవ్యోల్బణం, ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపదని భారత పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మాత్రం మారకం కోలుకుంటున్నదన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు.