Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 84,643.78 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు బలమైన కొనుగోళ్లతో మార్కెట్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 84,525.98 కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్టంగా 85,236.77 పాయింట్ల వరకు పెరిగింది. చివరకు 513.45 పాయింట్ల లాభంతో 85,186.47 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 142.60 పాయింట్లు పెరిగి 26,052.65 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.3శాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4శాతం పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ వరుసగా మూడవ సెషన్లో కొత్తగా 59,264.25 పాయింట్ల వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. 0.54శాతం లాభాలతో 59,216.05 వద్ద ముగిసింది. ఐటీ ఇండెక్స్ 3శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.2శాతం పెరిగింది. మీడియా ఇండెక్స్ 0.3శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.4శాతం తగ్గాయి.
నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మాక్స్ హెల్త్‌కేర్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఉండగా.. టీఎంపీవీ, కోల్ ఇండియా, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. వెస్ట్రన్ రైల్వేస్ నుంచి ఆర్డర్ సాధించినా జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ షేర్లు 2శాతం పడిపోయాయి. ఇన్ఫోసిస్ షేర్లు బైబ్యాక్ ఆఫర్ కంటే ముందు 4శాతం పెరగ్గా.. హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు దాదాపు 2శాతం వృద్ధిని నమోదు చేశాయి. బయోకాన్ షేర్ ధర 3శాతం తగ్గగా.. సెబీ హెచ్చరిక లేఖతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ షేర్ ధర 1.2శాతం పడిపోగా.. కెనడా విస్తరణ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు 4శాతం పెరిగాయి. భారత్ ఫోర్జ్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్, ఎంసిఎక్స్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఫెడరల్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ, బీహెచ్ఈఎల్ వంటి 120కి పైగా స్టాక్‌లు బీఎస్ఇలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి.