కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ)తో యావత్తు ప్రపంచానికి పెను ప్రమాదమే సంభవించేలా ఉందని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ముఖ్యంగా భారత ఐటీ పరిశ్రమకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏఐ ప్రభావం ఉద్యోగులపై నేరుగా ఉంటుందన్నది మరి. భారత్ సహా ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఏఐ జపం చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే హెచ్చరికలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. 2008లో చోటుచేసుకున్న అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కంటే భయంకర విపత్తుకే ఏఐ పోకడ దారితీసేలా ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడటం గమనార్హం.
అభివృద్ధి చెందిన దేశాలు సహా, అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఇప్పుడు ఏఐ వెంట పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర ఎన్నో దిగ్గజ సంస్థలు ఏఐని అందిపుచ్చుకుంటూ.. ఉద్యోగుల్ని తొలగిస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే భారత్‌లో ఏఐ కారణంగా జాబ్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ముఖ్యంగా దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఏఐ ప్రభావం ముందుగానే పడవచ్చని ఆర్థిక సర్వే పేర్కొన్నది. మార్కెట్లో పెరిగిన పోటీ, తగ్గిన వ్యాపారం, పడిపోతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా.. కీలక విభాగాల్లో మానవ వనరుల స్థానంలో కంపెనీల యాజమాన్యాలు ఏఐ టెక్నాలజీ వినియోగానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ.. ఉన్న ఉద్యోగాలను తొలగించడమేగాక, కొత్త ఉద్యోగావకాశాలనూ దూరం చేయగలదని ఆర్థిక సర్వే అంటున్నది. కాగా, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఇప్పటికిప్పుడు 10-20 శాతం మేరకే ఉన్నా.. దాని తీవ్రత మాత్రం మున్ముందు చాలా ఎక్కువగానే ఉంటుందన్నది. అసలే భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య సుంకాలతో సతమతమవుతున్న వేళ ఏఐతో మున్ముందు కష్టాలేనన్న రీతిలో ఆర్థిక సర్వే స్పందించడం గమనార్హం.
భారతీయ ఐటీ రంగం.. దేశంలో ఉద్యోగ కల్పన, ఎగుమతులు, జీడీపీ వృద్ధిలో కీలక పాత్రనే పోషిస్తున్నది. దేశీయ ఐటీ కంపెనీల ఆదాయంలో విదేశీ ప్రాజెక్టుల వాటానే అధికం. ప్రధానంగా అమెరికా, ఐరోపా తదితర దేశాల మార్కెట్లు భారత ఐటీ పరిశ్రమకు మూలాధారం అంటే అతిశయోక్తి కాదు. కానీ డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన దగ్గర్నుంచి దేశీయ ఐటీ సంస్థలకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు కొత్త రిక్రూట్మెంట్లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే వ్యయ నియంత్రణ చర్యలనూ చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఏఐ వినియోగాన్ని విస్తృతం చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకత ఏఐతో సాధ్యమని అనేక కంపెనీలు బలంగా నమ్ముతున్నాయి. దీంతో ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే నిరుద్యోగ సమస్య ఖాయమేనన్న సంకేతాలను తాజా ఆర్థిక సర్వే ఇచ్చింది.
దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగానే ఉందని, అప్రమత్తం కాకపోతే ప్రమాదం తప్పదని ఆర్థిక సర్వే హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్, ఆయన బృందం సిద్ధం చేసిన ‘ఎకనామిక్ సర్వే 2025-26’ను గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.

భారత ఆర్థిక వృద్ధి అంచనాలు, వాటిని అందుకోవడానికి ప్రభుత్వ చర్యలను పేర్కొంటూనే.. బడ్జెట్‌కు ముందు వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలనూ సర్వే తేటతెల్లం చేసింది. మార్కెట్ల బలోపేతానికి ఉన్న అవకాశాలు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు, రూపాయి విలువ, బంగారం-వెండి ధరలు.. ఇలా అనేక అంశాలను ప్రస్తావించింది. ఆర్థిక, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి సలహాలు, సూచనలనూ అందజేసింది.
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు కష్టాల్లో ఉన్నాయని ఆర్థిక సర్వేలో తేలింది. చెల్లింపుల్లో ఆలస్యం.. ఆయా ఇండస్ట్రీల వృద్ధిని కుంటుబడేలా చేస్తున్నదన్నది. ఎంఎస్ఎంఈలకు జరుగాల్సిన చెల్లింపుల్లో దాదాపు రూ.8.1 లక్షల కోట్లు ఆగిపోయాయని గుర్తుచేసింది. నిజానికి ప్రభుత్వాల నుంచీ ఈ పరిశ్రమలకు చేయూత కరువైందని పేర్కొన్నది. సూక్ష్మ శ్రేణి కంపెనీలకు, తొలిసారి రుణాలు తీసుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సులభతరంగా రుణ లభ్యత అవసరమని అభిప్రాయపడింది.

నిర్వహణపరమైన సవాళ్లతో ఎంఎస్ఎంఈలు సతమతమవుతున్నాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా సూక్ష్మ స్థాయి కంపెనీలను నగదు కొరత వేధిస్తున్నట్టు పేర్కొన్నది. సకాలంలో బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నాయని, రూ.8.1 లక్షల కోట్లు ఇలాగే ఆగిపోయాయని, ఫలితంగా మూలధనం కొరతను ఎదుర్కొంటున్నాయని, ఇది ఇండస్ట్రీలో వృద్ధిని ఆటంకపరుస్తున్నదని చెప్పింది.
ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యత పెరుగాల్సిన అవసరం ఎంతో ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే డిజిటల్ లెండింగ్ భాగస్వామ్యాలు.. ఇండస్ట్రీకి చక్కని ఫైనాన్సింగ్ అవకాశాలను అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రుణాలు సులభతరంగా అందితే ఎంఎస్ఎంఈలు బలోపేతం అవుతాయని, అది.. మరికొంత మంది ఔత్సాహికులు ఈ రంగంలోకి రావడానికి దోహదం చేయగలదన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్యలో వృద్ధిని సాధించనున్నదని ఆర్థిక సర్వే అంచనావేస్తున్నది. గతంలో అంచనావేసిన 7.4 శాతం కంటే ఇది తక్కువ. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిలకడైన వృద్ధిని నమోదు చేసుకుంటున్నట్టు వెల్లడించింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభు త్వం సంస్కరణల ఆధారంగా వృద్ధి అంచనా పరిగణనలోకి తీసుకున్నది.
ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న వాటాను పూర్తిగా విక్రయించండని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సర్వే సూచించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించుకోండి లేదా పూర్తి వాటాను అమ్మేయండని సూచించింది. 26 శాతం వాటాతో సంస్థను పూర్తిగా కంట్రోల్ చేసే అధికారం కూడా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పీఎస్‌యూల్లో వాటాను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 51 శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గించుకోవాలని లేకపోతే పూర్తిగా ఎగ్జిట్ అయిన పర్వాలేదని సూచించింది. 2016 నుంచి ఇప్పటి వరకు 36 సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 13 సంస్థల్లో వాటాలను విక్రయించింది. మిగతా వాటిలో విక్రయ ఆయా దశల్లో కొనసాగుతున్నది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు అమెరికా, తైవాన్, కొరియా దేశాలు కృత్రిమ మేధస్సుతోపాటు కేంద్రీకృత మార్కెట్లకోసం అధికంగా నిధులు కేటాయించడంతో ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గత నెలలో 3.9 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.