NHPC | న్యూఢిల్లీ, జనవరి 18: ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ కంపెనీ ఎన్‌హెచ్‌పీసీలో 3.5 శాతం వాటాను (35 కోట్ల షేర్లు) కేంద్రం అమ్మకానికి పెట్టింది. షేరుకు రూ.66 ధర ఫ్లోర్‌ప్రైస్‌గా నిర్ణయించిన ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) గురువారం ప్రారంభమైంది. ఓఎఫ్ఎస్ ద్వారా 2.5 శాతం వాటాను (25. 11 కోట్ల షేర్లు) విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,000 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ అయితే మరో 1 శాతం వాటాను (10 కోట్ల షేర్లు) ఆఫ్‌లోడ్ చేయనున్నట్టు ప్రకటించింది.
తొలిరోజునే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించిందని, 4.03 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యిందని, దీంతో తాము ప్రతిపాదించిన అదనపు వాటాను కూడా విక్రయించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఎక్స్పోస్టులో తెలిపారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ ఆఫర్లో తొలిరోజున సంస్థాగత ఇన్వెస్టర్లు, రెండోరోజైన శుక్రవారం రిటైల్, హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు పాలుపంచుకోవచ్చు. ఆఫర్లో 25 శాతం మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం కేంద్రానికి ఎన్‌హెచ్‌పీసీలో 71 శాతం వాటా ఉన్నది. ఓఎఫ్ఎస్ ఫ్లోర్ ధరను డిస్కౌంట్‌తో నిర్ణయించిన నేపథ్యంలో గురువారం ఎన్‌హెచ్‌పీసీ షేరు 3 శాతంపైగా క్షీణించి రూ.70.70 వద్ద ముగిసింది.
డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 10 వేల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల వాటా విక్రయం ద్వారా కేంద్రం రూ. 10,000 కోట్ల మేర నిధుల్ని సమీకరించింది. మార్కెట్ జోరును ఆసరా చేసుకుని ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో కోల్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హడ్కో, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్ వికాస్ నిగమ్, ఎస్జేవీఎన్ల్లో షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. ఎన్హెచ్పీసీకంటే ముందు సెప్టెంబర్‌లో ఎస్‌జేవీఎన్ ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 1,349 కోట్లు సేకరించింది.