న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశీయ ఎగుమతులు డీలాపడ్డాయి. వరుసగా 3 నెలలపాటు పెరుగుతూపోయిన భారతీయ ఎక్స్పోర్ట్స్.. గత నెల మాత్రం 1.20 శాతం క్షీణించాయి. ఈ ఏడాది జూలైలో 33.98 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. అంతకుముందు నెల జూన్లో 2.56 శాతం పెరిగి 35.20 బిలియన్ డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతంతో పోల్చితే దేశంలోకి దిగుమతులు దాదాపు 7.45 శాతం పెరిగాయి. 57.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు 23.50 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అంతకు క్రితం నెల జూన్లో ఇది 20.98 బిలియన్ డాలర్లుగా ఉంటే.. నిరుడు జూలైలో 19.30 బిలియన్ డాలర్లే.
ముడి చమురు సెగ
జూలైలో దేశంలోకి పెద్ద ఎత్తున జరిగిన ముడి చమురు దిగుమతులు.. వాణిజ్య లోటును పెంచేశాయి. గతంతో చూస్తే 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేరాయి. ఇక వెండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా భారీగానే దిగాయి. దీంతో దేశీయ దిగుమతుల విలువ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు విదేశాలకు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మునుపటితో పోల్చితే 22.15 శాతం దిగజారి 5.22 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యా యి. అయినప్పటికీ ఈ ఏడాది భారతీయ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గత ఏడాది నమోదైన 778 బిలియన్ డాలర్లను దాటేస్తాయన్న ఆశాభావాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కనబరుస్తున్నది.
ఏప్రిల్-జూలైలో..
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్-జూలైలో దేశీయ వ్యాపారాత్మక ఎగుమతులు 4.15 శాతం వృద్ధితో 144.12 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులూ 7.57 శాతం ఎగిసి 229.70 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే వ్యవధిలో 75.15 బిలియన్ డాలర్లే. ఫలితంగా ఈసారి 10.43 బిలియన్ డాలర్లు పెరిగినైట్టెంది. అయితే సేవా రంగ ఎగుమతులు మునుపటితో పోల్చితే 106.79 బిలియన్ డాలర్ల నుంచి 117.35 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దిగుమతులు 62.95 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనా.
జూలైలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో క్షీణత.. ఓవరాల్గా దేశీయ ఎగుమతుల విలువను గట్టిగానే తగ్గించేసింది. మార్కెట్లో ధరల పతనం, అంతర్జాతీయంగా లేని డిమాండ్, పెరిగిన దేశీయ వినియోగం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్ని అడ్డుకున్నాయి. ఎగుమతుల వృద్ధికి అమెరికా, ఐరోపా, చైనాలకుతోడు ఆఫ్రికా దేశాలపైనా దృష్టి పెడుతున్నాం. ఈ-కామర్స్ మార్కెట్లోని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం.
-సునీల్ భరత్వాల్, కేంద్ర వాణిజ్య కార్యదర్శి
పెరిగిన రవాణా చార్జీలు, పడిపోయిన వస్తూత్పత్తుల ధరలు, నౌకలు-కంటెయినర్ల కొరత వంటి కారణాలు దేశీయ ఎగుమతుల్ని దెబ్బతీశాయి. అయితే వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగవుతాయనే అనుకుంటున్నాం. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఇంకా అక్కడి భారతీయ వ్యాపార కార్యకలాపాలు మొదలు కాలేదు. కర్మాగారాలు మూతబడే ఉన్నాయి. ఇది మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి ప్రతికూలమే.
-అశ్వనీ కుమార్, భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య అధ్యక్షుడు