Rupee | ముంబై, జనవరి 2: భారతీయ కరెన్సీ రూపాయి.. డాలర్ ముందు తేలిపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో రూపీ మారకపు విలువ రోజుకింత దిగజారుతూ ఆల్‌టైమ్ కనిష్ఠాలకు పతనమవుతున్నది. గురువారం మరో 11 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా డాలర్‌తో పోల్చితే ఎక్సేంజ్ రేటు 85.75 వద్దకు క్షీణించింది. దీంతో ఈ ఏడాది రూపాయికి తొలి నష్టం ఎదురైనైట్టెంది. ఇంట్రా-డేలోనైతే 85.79కి పడింది. ఇక బుధవారం స్థిరంగా ఎక్కడిదక్కడే ఉన్న విషయం తెలిసిందే.
కాగా, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్, దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్టు ట్రేడర్లు చెప్తున్నారు. కాగా, ఈ 2025లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలు తక్కువేనన్న సంకేతాలు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాబోతుండటంతో పరుగులు పెడుతున్న డాలర్ ఇండెక్స్, అమెరికా పదేండ్ల బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారడం వంటివి భారతీయ కరెన్సీని మరింత ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. రూపాయి పత నం దేశ ఆర్థిక వ్యవస్థకూ ఇబ్బందే. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, జీడీపీ పతనం వంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది.