న్యూఢిల్లీ, జూన్ 2 : దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబించే గణాంకాల పేర్లను, వాటి కొలతల ప్రక్రియను ఒక్కొక్కటిగా మార్చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం లెక్క వంతు వచ్చింది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్‌ను రాబోయే ఐదేండ్లలో క్రమక్రమంగా పక్కనపెట్టి, దాని స్థానంలో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ)ను తెస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖల ప్రధాన ఆర్థిక సలహాదారు ప్రవీణ్ మహతో తాజాగా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ).. ఈ నెల 15న కొత్త బేస్ ఇయర్ 2022-23 ఆధారంగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేస్తుందని చెప్పారు. ఇప్పటిదాకా 2011-12 సంవత్సరం ధరల ఆధారంగా టోకు ద్రవ్యోల్బణం గణన జరిగింది. కాగా, ఇప్పటికే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) సహా మరికొన్నింటి గణన ప్రామాణికాలను మోదీ సర్కార్ మార్చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరింత సవివరంగా పీపీఐ గణాంకాలను విడుదల చేయబోతున్నట్టు మహతో చెప్తున్నారు. ఔట్పుట్, ఇన్పుట్, సేవల ధరల కవరేజీతో పీపీఐ గణాంకాలను రూపొందిస్తామని అంటున్నారు. అప్పుడే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తీరుతెన్నులను కచ్ఛితంగా అంచనా వేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ నెల 15న బ్యాంకింగ్, సెక్యూరిటీస్ లావాదేవీలు, బీమా, పెన్షన్ ఫండ్స్ నిర్వహణ, రైల్వేలు, విమాన ప్రయాణికులు, టెలికాం రంగాలకు సంబంధించి ఔట్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (ఓపీపీఐ), ట్రయల్ ఇన్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (ఐపీపీఐ), సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (సర్వీస్ పీపీఐ) గణాంకాలను కొత్త సిరీస్ 2022-23 సంవత్సరం ఆధారంగా విడుదల చేస్తామని మహతో ఈ సందర్భంగా తెలియజేశారు. 1942లో డబ్ల్యూపీఐ పరిచయమైంది. నాడు దాని బేస్ ఇయర్ 1939. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఏడుసార్లు బేస్ ఇయర్‌ను మార్చారు. 2017లో ఇప్పుడున్న 2011-12 బేస్ ఇయర్ మొదలైంది.
అధిక పెట్రోల్, డీజిల్ ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీవ్రతరం చేస్తాయని మంగళవారం తమ నివేదికలో దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ హెచ్చరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 42 నెలల గరిష్ఠాన్ని తాకుతూ టోకు ద్రవ్యోల్బణం 8.3 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం కనిపించింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. దేశీయ మార్కెట్లో ఇంధన ధరల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. అమెరికాకు అండగా ఉంటున్నాయని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నది. ఫలితంగా గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. మరోవైపు హొర్ముజ్ జలసంధిలో రవాణాను సైతం ఇరాన్ అడ్డుకుంటున్నది. దీంతో భారత్ తదితర దేశాలకు చమురు కష్టాలు వచ్చిపడ్డాయి. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అందులో గల్ఫ్ దేశాలదే మెజారిటీ వాటా మరి. దీంతో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు తగ్గట్టుగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు, ఉత్పాదక వ్యయాలు పెరిగి ఆయా వస్తూత్పత్తుల రేట్లు ఎగబాకుతున్నాయని క్రిసిల్ ప్రస్తుత ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నది. ఈ క్రమంలోనే రాబోయే నెలల్లో అటు రిటైల్, ఇటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఇంకా పెరుగుతాయని కూడా అంచనా వేసింది. మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.8 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు విజృంభిస్తే.. దేశీయంగానూ ఇంధన ధరలు ఇంకా పెరిగే వీలుందని క్రిసిల్ అంటున్నది.
ఈసారి ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బుధవారం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. ఈ క్రమంలోనే మెజారిటీ ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ అధిపతులు.. రెపో రేటు ఎక్కడిదక్కడే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నట్టు పీటీఐ నిర్వహించిన ఓ పోల్ సర్వేలో తేలింది. అయితే కొందరు పావు శాతం పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం వడ్డీరేట్ల పెంపు రెండుసార్లే ఉండవచ్చని వారంతా చెప్తుండటం గమనార్హం. కాగా, గత ఏడాది నుంచి వృద్ధిరేటు బలోపేతానికి రెపో రేటును 1.25 శాతం తగ్గించిన ఆర్బీఐ.. ఆ తర్వాత విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా స్థిరంగా కొనసాగిస్తున్నది. కానీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణాలు వేగంగా పెరుగుతున్నాయిప్పుడు. దీంతో వడ్డీరేట్ల పెంపు అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉన్నది. ఇది పెరిగితే బ్యాంకింగ్ రుణాలపై వడ్డీరేట్లూ పెరుగుతాయి. దీంతో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు ప్రియమవుతాయి. ఈ ప్రభావం ఆయా రంగాలపై పడి దేశ జీడీపీ క్షీణిస్తుందని, అసలే గల్ఫ్ వార్తో ఒత్తిడి పడుతున్న వేళ.. వడ్డీరేట్ల పెంపు ఇంకా పరిస్థితుల్ని దిగజారుస్తాయన్న భయాలున్నాయి. అందుకే ఈసారి వడ్డీరేట్ల పెంపు ఉండదనే మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.