Smart Phone Sales | ఇంతకు ముందుతో పోలిస్తే దేశంలో స్మార్ట్ ఫోన్లకు (smartphones) గిరాకీ పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికంలో 3.1 కోట్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. 2021-22 మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇది 19 శాతం తక్కువ అని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. గమ్మత్తేమిటంటే ప్రీమియం, ఆల్ట్రా ప్రీమియం ఫోన్లపై స్మార్ట్ ఫోన్ ప్రియులు మనస్సు పారేసుకున్నారు. ఇక ఫోన్ల తయారీ సంస్థల్లో శాంసంగ్‌దే అగ్రస్థానం. వరుసగా రెండోసారి 20 శాతం మార్కెట్ వాటా పొంది అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ప్రత్యేకించి 5జీతో వచ్చిన ఏ సిరీస్ ఫోన్లతో శాంసంగ్ నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తం శాంసంగ్ ఫోన్ల సేల్స్‌లో 50 శాతం `ఏ` సిరీస్ ఫోన్లేనని కౌంటర్ పాయింట్ పేర్కొంది. రూ.45 వేలకుపైగా విలువ గల ప్రీమియం, ఆల్ట్రా ప్రీమియం ఫోన్ల సేల్స్ (మొత్తం ఫోన్ల సేల్స్‌లో 43%) లో 247 శాతం గ్రోత్ రికార్డైంది.
శాంసంగ్ తర్వాతీ స్థానంలో వివో నిలిచినా.. గతేడాదితో పోలిస్తే మూడు శాతం సేల్స్ తగ్గి 17 శాతానికి పడిపోయాయి. షియోమీ సేల్స్ 44 శాతం పతనం అయ్యాయి. 16 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ ఫోన్లకు మంచి ఆదరణ ఉందని కౌంటర్ పాయింట్ వివరించింది. ఇదిలా ఉంటే, వన్‌ప్లస్ వేగంగా డెవలప్ అవుతున్న బ్రాండ్‌గా నిలిచింది. 2021-22తో పోలిస్తే గతేడాది 72 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. ఆపిల్ ఫోన్ల విక్రయాలు మార్కెట్లో ఆరు శాతమైనా.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 50 శాతం సేల్స్ పెరిగాయి.
గత తొమ్మిది నెలలుగా స్మార్ట్ ఫోన్ల సేల్స్ పడిపోతున్నా.. ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి అని కౌంటర్ పాయింట్ తెలిపింది. కానీ, ప్రీమియం స్మార్ట్ ఫోన్ల వైపు మొగ్గుతున్నవారు పెరుగుతున్నారు. రూ.20-30 వేల మధ్య ఫోన్ల కొనుగోళ్లు 33 శాతం, రూ.10-20 వేల మధ్య ఫోన్ల సేల్స్ 34 శాతం, రూ.10 వేల లోపు విలువ గల ఫోన్ల విక్రయాలు తొమ్మిది శాతం తగ్గాయి.