దేశ ఆర్థిక వ్యవస్థను మందగమనం ఆవహించిందా? 2028కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్ కలలు కల్లలేనా? అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజా గణాంకాలు.. ఇవే ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. 2025లో దేశ జీడీపీ ర్యాంక్ 6వ స్థానానికి దిగజారిందీ మరి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. గత ఏడాదికిగాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజాగా విడుదల చేసిన జీడీపీ ర్యాంకుల్లో భారత్ టాప్-5 నుంచి దిగజారింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీల్లో 6వ స్థానానికి పడిపోయింది. దీంతో 2028కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగాలన్న భారత్ కలలు కల్లలేననిపిస్తున్నది. ఆ లక్ష్యం నెరవేరాలంటే 2031దాకా ఆగాల్సిందేనని ఇప్పుడు ఐఎంఎఫ్ గణాంకాలు చెప్పకనే చెప్తున్నాయి మరి.
2024తో పోల్చితే 2025లో దేశ జీడీపీ ర్యాంక్ ప్రపంచ స్థాయిలో 5 నుంచి 6కు క్షీణించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. నిరుడు దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 3.92 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదే సమయంలో బ్రిటన్ ఎకానమీ వాల్యూ 4 ట్రిలియన్ డాలర్లని తేలింది. దీంతో గత ఏడాదికిగాను వరల్డ్ జీడీపీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ను బ్రిటన్ వెనుకకు నెట్టి 5వ స్థానంలో నిలిచింది. 2024లో భారత్ జీడీపీ విలువ 3.5 ట్రిలియన్ డాలర్లు. బ్రిటన్‌ది 3.4 ట్రిలియన్ డాలర్లే. అందుకే ఆ ఏడాది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉన్నది. 6వ స్థానానికి బ్రిటన్ పరిమితమైంది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏ స్థాయిలో పతనమవుతున్నదో చూస్తూనే ఉన్నాం. నానాటికీ పడిపోతున్న రూపీ వాల్యూ.. ఇటీవలికాలంలో ఆల్‌టైమ్ కనిష్ఠాన్నీ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కరెన్సీ నష్టాలు.. దేశీయ దిగుమతుల్ని భారం చేయడం మాత్రమేగాక, దేశ ఆర్థిక వ్యవస్థనూ కుప్పకూల్చగలదు. ఐఎంఎఫ్ తాజా జీడీపీ ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌కు ముప్పు తెచ్చింది ఈ రూపాయే. 2025లో రూపీ ఎక్సేంజ్ వాల్యూ రూ.4.24 తగ్గింది. 2024 ఆఖర్లో డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.85.64గా ఉన్నది. 2025 చివర్లో ఇది రూ.89.88కి క్షీణించింది.
ఈ క్రమంలో డాలర్లలోనే ఆయా దేశాల జీడీపీ విలువను కొలుస్తారు కాబట్టి.. రూపీ నష్టాలు ఆ మేరకు ప్రభావం చూపాయని ఐఎంఎఫ్ అంటున్నది. దీన్నిబట్టి ఈ ఏడాది దేశ జీడీపీ ర్యాంక్ ఇంకా తగ్గిపోతుందేమోనన్న భయాలు కనిపిస్తున్నాయి. ఈ మార్చి 27న రూపాయి మారకం విలువ తొలిసారి 94.85 వద్దకు దిగజారింది. ఒకానొక దశలోనైతే ఏకంగా 95 మార్కుకు ఎగువన 95.22 స్థాయిని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకుతోడు దాదాపు 50 రోజులుగా జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. కరెన్సీ మార్కెట్లో రూపాయిపై అమ్మకాల ఒత్తిడిని పెంచుతున్నది. దేశీయ దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడుతున్నారు మరి. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థ.. సంక్షోభంలోకి జారుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం.
ఈ ఏడాదిలోనూ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 6వ స్థానానికే పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం, డాలర్ల డిమాండ్, రూపాయి నష్టాలు ఇతరత్రా కారణాల దృష్ట్యా.. 2026లోనూ దేశ ఎకానమీ వరల్డ్ టాప్-5 జీడీపీల్లో చోటుచేసుకోకపోవచ్చని అభిప్రాయపడుతున్నది. అయితే 2027లో బ్రిటన్ను అధిగమించి మళ్లీ భారత జీడీపీ ర్యాంకింగ్ మెరుగు పడవచ్చని చెప్తున్నది. అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 4.58 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నది.
బ్రిటన్ 4.47 ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోవచ్చని విశ్లేషిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచే అవకాశాలుండేది 2031లోనే అన్న అభిప్రాయాన్ని ఐఎంఎఫ్ వెలిబుచ్చింది. దేశ జీడీపీ 6.79 ట్రిలియన్ డాలర్లుగా, ఇదే సమయంలో జపాన్ జీడీపీ వాల్యూ 5.13 ట్రిలియన్ డాలర్లేనన్నది.
