న్యూఢిల్లీ: కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ(GST Rates) తగ్గించే ఆలోచనల్లో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 175 ఉత్పత్తులపై పది శాతం పన్ను తగ్గించే అవకాశం ఉన్నది. షాంపూలు, హైబ్రిడ్ కార్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై ట్యాక్స్‌ను తగ్గించనున్నారు. టాల్కమ్ పౌడర్, టూత్‌పేస్ట్, షాంపూలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నారు. దీంతో హిందుస్తాన్ యునీలివర్, గోద్రేజ్ కంపెనీ ఉత్పత్తులపై సేల్స్ పెరగనున్నాయి. ఏసీలు, టీవీల్లాంటి ఎలక్ట్రానిక్ కన్జ్యూమర్ ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో దివాళీ షాపింగ్ సీజన్ సమయంలో ఈ కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సోనీ కంపెనీ ఉత్పత్తుల సేల్స్‌పై ప్రభావం పడనున్నది.
పెట్రోల్ హైబ్రిడ్ కార్లపై పన్ను శాతాన్ని 28 నుంచి 18కి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇదొకరకంగా టొయోటా, మారుతీ సుజుకీ కంపెనీలకు శుభసూచకమే. తమ పెట్రోల్ కార్లు క్లీన్ అని , పన్ను తగ్గించాలని చాన్నాళ్లుగా ఆ కంపెనీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశాల్లో ఏయే ఉత్పత్తులపై పన్ను తగ్గే విషయం తెలవనున్నది. జీఎస్టీలో భారీగా సంస్కరణలు ఉండనున్నట్లు ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే.