న్యూఢిల్లీ, మే 9 : దేశీయ స్టాక్ మార్కెట్లపై భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది మరి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 411.97 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 140.60 పాయింట్లు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమం లో శుక్రవారం సెన్సెక్స్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం క్షీణించి 79,454.47 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం కోల్పోయి 24,008 వద్ద నిలిచింది. ఫలితంగా గురు, శుక్రవారాల్లో సెన్సెక్స్ 1,292.31 పాయింట్లు, నిఫ్టీ 306.40 పాయింట్లు పతనమైనట్టు తేలింది. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.7,09,783.32 కోట్లు తగ్గి రూ.4,16,40,850.46 కోట్లకు (4.86 ట్రిలియన్ డాలర్లు) పరిమితమైంది. గురువారం రూ.5,00,037.74 కోట్లు, శుక్రవారం రూ.2,09,745.58 కోట్లు దిగజారింది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉన్నప్పటికీ.. భారతీయ సూచీలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయని, ఇందుకు కారణంగా భారత్-పాక్ సంఘర్షణలేనని మెహెతా ఈక్విటీస్ లిమిటెడ్ రిసెర్చ్ విభాగం సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ అన్నారు. ప్రస్తుత ఉద్రిక్తకర వాతావారణం మదుపరుల్లో భయాందోళనల్ని రేకెత్తిస్తున్నట్టు చెప్పారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని బజాజ్ బ్రోకింగ్ రిసెర్చ్ విశ్లేషించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రిసెర్చ్ సీనియర్ వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
రియల్టీ రంగ షేర్లు గరిష్ఠంగా 2.08 శాతం నష్టపోయాయి. యుటిలిటీస్ (1.50 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.40 శాతం), విద్యుత్తు (1.11 శాతం), బ్యాంకింగ్ (1.04 శాతం), ఎఫ్ఎంసీజీ (0.65 శాతం), సర్వీసెస్ (0.63 శాతం) షేర్లూ నిరాశపర్చాయి. సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.30 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.10 శాతం మేర నష్టపోయాయి.
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్షణ రంగ, దాని అనుబంధ రంగాల సంస్థల షేర్లకు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది. రాబోయే రోజుల్లో భద్రతాపరమైన కోణంలో ఎక్కువగా ఖర్చుచేసే వీలుండటంతో అంతా డిఫెన్స్ స్టాక్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. డ్రోన్ తయారీ కంపెనీల షేర్లకూ డిమాండ్ కనిపిస్తున్నది. శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈలో ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ షేర్ విలువ అత్యధికంగా 20 శాతం పుంజుకోవడం గమనార్హం. ప్రస్తుతం భారత్-పాక్ సంఘర్షణల్లో డ్రోన్ల ప్రయోగం, వాటి పాత్రను చూస్తూనే ఉన్నాం. ‘ఇన్వెస్టర్ల నుంచి డిఫెన్స్ స్టాక్స్‌కు బాగా డిమాండ్ వ్యక్తమవుతున్నది. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యమే కారణం’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, వెల్త్ మేనేజ్మెంట్ రిసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లకూ మార్కెట్లో ఒక్కసారిగా ఆదరణ పెరిగిందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రిసెర్చ్ సీనియర్ వీపీ అజిత్ మిశ్రా తెలిపారు.
ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ 20%
పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 7.18%
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 5.34%
డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ 4.99%
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2.92%
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1.84%
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ 1.38%