న్యూఢిల్లీ, జూలై 11: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) అడ్డాగా భారత్ మారిపోతున్నది. గడిచిన దశాబ్దకాలంలో జీసీసీలను ఆకట్టుకుంటున్న దేశాల్లో తొలిస్థానంలో నిలిచిన భారత్..భవిష్యత్తులోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించనున్నదని సర్వేలు నొక్కివక్కాణిస్తున్నాయి. తాజాగా దేశీయ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ కూడా ఇదే తరహా నివేదికను విడుదల చేసింది. 2024 నుంచి 2025 మధ్యకాలంలో దేశంలో కొత్తగా 180 జీసీసీలు ఏర్పాటైనట్టు, తద్వారా 2.7 లక్ష లక్షల మంది టెక్నాలజీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించినట్టు వెల్లడించింది.
టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా కృత్రిమ మేథస్సుకు పెరుగుతున్న డిమాండ్, ఇటీవలకాలంలో ఏఐ వినిమయం 5-7 శాతం వరకు పెరగడం కూడా జీసీసీలకు డిమాండ్ అధికమవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నది. ఐటీ నగరాలైన బెంగళూరుతోపాటు హైదరాబాద్, ముంబై, ఎన్సీఆర్, పుణెలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి.
దేశంలో రిటైల్ జీసీసీల వృద్ధి వేగంగా పుంజుకుంటున్నది. కేవలం అమెరికన్ రిటైలర్లదే కాకుండా యూరప్‌నకు చెందిన పెద్ద కంపెనీలు కూడా భారత్‌కు తరలివస్తున్నాయి. ఇక్కడ నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు అత్యధిక స్థాయిలో లభిస్తుండటం, వ్యాపార అనుకూల విధానాలు, పన్ను ప్రొత్సాహకాలు, మౌలిక సదుపాయాలకోసం తక్కువ ఖర్చు అవుతుండటం, ప్రభుత్వ మద్దతు లభిస్తుండటంతో బహుళజాతి కంపెనీలు దేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి.
– నేతి శర్మ, టీమ్‌లీజ్ సీఈవో