Brazil – Crude Oil | దేశ ఖజానాపై ముడి చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకునే విషయమై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకూ రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్.. మరో అడుగు ముందుకేసింది. బ్రెజిల్ నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకునే విషయమై ఆ దేశ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన బ్రెజిల్ పెట్రోబ్రాస్ అధ్యక్షుడు మార్గా చాంబ్రియార్డ్ తో సంప్రదింపులు జరిపారు. బ్రెజిల్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడంతోపాటు ఆఫ్ షోర్ డీప్, ఆల్ట్రా డీప్ వాటర్ ఎక్స్ ప్లోరేషన్ ప్రాజెక్టుల్లో భారత్-బ్రెజిల్ కంపెనీల మధ్య సహకారంపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయని ఎక్స్ వేదికగా హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
‘బ్రెజిల్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారు. ఈథనాల్, వెజిటబుల్ ఆయిల్ డెరివైడ్ బయో డీజిల్ తయారీలో గ్లోబల్ పయనీర్ గా నిలిచింది. సుస్థిర ఏవియేషన్ ఫ్యూయల్ అభివృద్ధి కోసం బ్రెజిల్, భారత్ కలిసి పని చేస్తాయి. 2025 ఫిబ్రవరి 11-14 మధ్య ఢిల్లీలో జరిగే ఇండియా ఎనర్జీ వీక్ లో పాల్గొని చర్చించాలని కోరాను’ అని హర్దీప్ సింగ్ పూరీ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.
ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్.. వైవిధ్య భరితమైన ఇంధన దిగుమతులపై దృష్టి కేంద్రీకరించింది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ దిగుమతిలో తన వ్యూహానికి అనుగుణంగా పెట్రోబ్రాస్ తో గత జూలైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిలెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు చర్చలు జరిపారు.