Growth Rate | న్యూఢిల్లీ, జూలై 31: కీలక రంగాల్లో వృద్ధిరేటు పడిపోయింది. జూన్లో 8 ప్రధాన మౌలిక రంగాల్లో ఉత్పాదకత 20 నెలల కనిష్టాన్ని తాకుతూ 4 శాతంగానే నమోదైంది. 2022 అక్టోబర్లో 0.7 శాతంగానే ఉన్నది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో క్షీణత చోటుచేసుకున్నట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. కాగా, అంతకుముందు నెల మేలో 6.4 శాతంగా ఉన్న వృద్ధిరేటు.. నిరుడు జూన్లో 8.4 శాతంగా ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.
ఈసారి వృద్ధిరేటు ఏడాదిన్నరకుపైగా కనిష్ట స్థాయిని తాకడం వెనుక మందగించిన ముడి చమురు, రిఫైనరీ ఉత్పాదకతే కారణమని స్పష్టమవుతున్నది. ఈ రెండు రంగాల్లో వరుసగా మైనస్ 2.6 శాతం, మైనస్ 1.5 శాతం ఉత్పాదకత నమోదైంది. కాగా, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు రంగాలనే కీలక మౌలిక రంగాలుగా పరిగణిస్తారు. దీంతో ఈ రంగాల తీరుతెన్నులు.. దేశ జీడీపీని ప్రతిబింబిస్తాయి. అలాంటి రంగాల్లో ఇంతటి నిరాశాజనక వృద్ధిరేటు నమోదవడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు. దేశ పారిశ్రామిక ప్రగతికి కొలమానంగా భావించే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లోనూ ఈ 8 రంగాల వాటా 40.27 శాతంగా ఉన్నది.
ముడి చమురు, చమురుశుద్ధి రంగాలతోపాటు సహజ వాయువు, ఎరువులు, ఉక్కు, సిమెంట్ రంగాల్లోనూ ఉత్పాదకత జూన్లో తగ్గుముఖం పట్టింది. గతంతో పోల్చితే ఈ రంగాల్లో వృద్ధిరేటు వరుసగా 3.3 శాతం, 2.4 శాతం, 2.7 శాతం, 1.9 శాతానికి దిగజారింది. అయితే నిరుడు జూన్ కంటే ఈ జూన్లో బొగ్గు ఉత్పాదకత 14.8 శాతానికి, విద్యుదుత్పత్తి 7.7 శాతానికి పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి 8 రంగాల్లో 6 రంగాల పనితీరు నిరాశపర్చింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ఈ కీలక రంగాల ఉత్పాదకత రేటు 5.7 శాతంగా ఉన్నది. నిరుడు ఇదే వ్యవధిలో 6 శాతంగా నమోదైంది. మరోవైపు తాజా గణాంకాల ప్రభావం.. రాబోయే ఐఐపీ లెక్కలపైనా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.