Forex Reserves | ఈ నెల 11వ తేదీతో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.567 బిలియన్లు పెరిగి 677.835 బిలియన్లకు చేరుకున్నాయి. వరుసగా ఆరోవారం విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగినట్లుగా ఆర్బీఐ డేటా పేర్కొంది. ఏప్రిల్ 4తో ముగిసిన గతవారంలో ఫారెక్స్ నిల్వలు 10.872 బిలియన్లు పెరిగి 676.268 బిలియన్లకు చేరాయి. సెప్టెంబర్ 2024లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 704.885 బిలియన్లతో గరిష్ఠ స్థాయికి పెరిగాయి.
ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో 892 మిలియన్లు పెరిగి 574.98 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో.. ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి యూఎస్యేతర యూనిట్ల పెరుగుదల, తరుగుదల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ వారంలో బంగారు నిల్వలు 638 మిలియన్లు పెరిగి 79.997 బిలియన్ల చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 60 మిలియన్లు తగ్గి 18.356 బిలియన్లకు చేరుకున్నాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఐఎంఎఫ్ వద్ద భారతదేశ రిజర్వ్ స్థానం 43 మిలియన్లు పెరిగి 4.502 బిలియన్ల డాలరకు చేరుకున్నాయని డేటా వివరించింది.