FDI | పరిశ్రమలు, అభివృద్ధికి పెట్టుబడులు అవసరం. ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు కావాలి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2000 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటాయి. తద్వారా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా భారత్ నిలిచింది. 2000 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 1,09,219 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ పెట్టుబడులు వచ్చాయి. వాటిల్లో ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లు రు.45.96 లక్షల కోట్లు (708.65 బిలియన్ డాలర్లు). మొత్తం ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో 69 శాతం పెట్టుబడులు 2014 ఏప్రిల్ – 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చినవే.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ఎఫ్‌డీఐ పెట్టుబడులు 26 శాతం పెరిగి 42.1 బిలియన్ డాలర్లకు చేరాయి. నాన్ డెట్ ఫైనాన్సియల్ రీసోర్సెస్ రూపంలో ఎఫ్‌డీఐ పెట్టుబడుల గ్రోత్ పెరిగింది. వీటి ద్వారా టెక్నాలజీ బదిలీ, ఉద్యోగ అవకాశాల కల్పన పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 19.81 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ పెట్టుబడులు వస్తే వాటిల్లో 13.61 బిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడులే కావడం గమనార్హం.
ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో మారిషస్ నుంచి 25 శాతం పెట్టుబడులు వచ్చాయి. 2000 ఏప్రిల్ – సెప్టెంబర్ 2024 మధ్య మారిషస్ ద్వారా 177 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ లోకి వచ్చాయి. రెండో స్థానంలో సింగపూర్ నిలిచింది. మొత్తం ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో 167.5 బిలియన్ డాలర్లతో సింగపూర్ వాటా 24 శాతం ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో మారిషస్ ను దాటేసిన సింగపూర్ 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్ కు తరలించింది. భారత్ తో మారిషస్, సింగపూర్ ప్రభుత్వాలకు అనుకూల పన్ను ఒప్పందాలు ఉండటం దీనికి మరో కారణం.