Stock Markets | ముంబై, ఆగస్టు 29: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్ సంస్థల ర్యాలీతో సూచీలు మరో శిఖరానికి చేరుకున్నాయి. గత పదిరోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు గురువారం మరో రికార్డు స్థాయిలో ముగిశాయి. అన్ని రంగాల షేర్లలో క్రయ విక్రయాలు జోరుగా సాగడం, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో ఇంట్రాడేలో ఆల్‌టైం హైకి చేరుకున్న సూచీలు చివర్లో ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల స్థాయిలో పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 349.05 పాయింట్లు అందుకొని 82,134.61 వద్ద ముగిసింది. సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం. గత ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్ 1,709.93 పాయింట్లు లేదా 2.12 శాతం లాభపడింది.
మరో సూచీ నిఫ్టీ 25 వేల పాయింట్ల పైన ముగిసింది. ఒక దశలో 140 పాయింట్లు లాభపడిన నిఫ్టీ చివరకు 99.60 పాయింట్లు అందుకొని 25,151.96 వద్ద స్థిరపడింది. గత 11 సెషన్లలో నిఫ్టీ 1,012.95 పాయింట్లు లేదా 4.19 శాతం లాభపడింది. మార్కెట్లో టాటా మోటర్స్ అత్యధికంగా నాలుగు శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, మారుతి, ఎస్బీఐలు లాభాల్లో ముగిశాయి. బోనస్ షేరును ప్రకటించడంతో రిలయన్స్ షేరు ఏకంగా 1.50 శాతం లాభపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.30,389. 92 కోట్లు పెరిగి రూ.20,57,382.97 కోట్లకు చేరుకున్నది. కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్‌లు నష్టపోయాయి.