న్యూఢిల్లీ/ముంబై, నవంబర్ 2: గతేడాది కరోనాతో కళతప్పిన ధనత్రయోదశి (ధంతేరాస్).. ఈసారి మాత్రం మార్కెట్లో కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. ధంతేరాస్ సందర్భంగా మంగళవారం బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగాయి. కొవిడ్-19 నిబంధనలు, ప్రభావం తగ్గడంతో దుకాణాల్లో పెద్ద ఎత్తున కొనుగోలుదారుల సందడి కనిపించింది. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల విశ్వాసం. ఇందుకు తగ్గట్లే వ్యాపారులూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి డిమాండ్ బాగుందని నగల వర్తకులు చెప్పారు. నగలతోపాటు నాణేలకూ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే కరోనాకు ముందున్న స్థాయిని ఈ ధంతేరాస్ విక్రయాలు తాకాయి. సాధారణంగా ధనత్రయోదశికి 20-30 టన్నుల బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఈసారి మరింత ఎక్కువగా జరుగవచ్చని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు రాత్రి 8 గంటల నాటికి 15 టన్నుల విక్రయాలు (రూ.75,000 కోట్లు) జరిగాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య తెలిపింది.
రూ.10వేలు డౌన్
నిరుడు ఆగస్టులో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,000 పలికింది. అయితే మంగళవారం రూ.47,644 (పన్నులు అదనం)లుగానే ఉన్నది. ఇది కూడా కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.