హైదరాబాద్, సెప్టెంబర్ 21: బంగారం సామాన్యుడికి అందనంటుంది. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పుత్తడి శనివారం 76 వేలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ధరలు పుంజుకోవడం, ఫెడ్ వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎగువముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర శనివారం ఒకేరోజు రూ.820 ఎగబాకి రూ.75,930 పలికింది. అంతకుముందు ఇది రూ.75,110గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ ధర కూడా రూ.750 అందుకొని రూ.69,600కి చేరుకున్నది.
దీంతోపాటు వెండి ధరలు కూడా మరింత పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.500 పెరిగి రూ.98 వేలకు చేరుకున్నది. మరోవైపు, ప్రస్తుత సంవత్సరంలో బంగారం ధరలు 27 శాతం వరకు పెరిగాయి. 2010 తర్వాత ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మధ్యప్రాచ్యం దేశాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నది. ధరలు అంతకంతకు పెంజుకోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. గరిష్ఠ స్థాయికి పుత్తడి చేరుకోవడంతో కొనుగోళ్లు చేయడానికి జంకుతున్నారని ఆభరణాల వర్తకులు వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి రికార్డుల మీద రికార్డుల స్థాయిలో ర్యాలీ జరుపుతున్నది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను అర శాతం తగ్గించడంతో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,600 డాలర్ల పైకి చేరుకున్నది.
స్పాట్ మార్కెట్లో పుత్తడి విలువ 1.3 శాతం ఎగబాకి 2,620.26 డాలర్లు పలికింది. బంగారం చరిత్రలో ఇంతటి స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అలాగే వెండి కూడా 1.4 శాతం బలోపేతమై 31.21 డాలర్లకు చేరుకున్నది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో ర్యాలీ జరుపుతున్నప్పటికీ త్వరలో కరెక్షన్ గురయ్యే అవకాశాలున్నాయని పెట్టుబడిదారులు హెచ్చరిస్తున్నారు.