ముంబై, డిసెంబర్ 27: బ్యాంకులకు ముందంతా గడ్డు కాలమేనని, ఈ రంగంలో అనిశ్చిత వాతావరణమే ఎక్కువని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఓ తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపే వీలుందని పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ‘ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా’ నివేదికను మంగళవారం ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో భారతీయ బ్యాంకుల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ) 5.8 శాతం తగ్గుముఖం పట్టాయని, ఆస్తులు కూడా పెరిగాయన్నది. అయినప్పటికీ బ్యాంకింగ్ రంగ భవిష్యత్తుపై మాత్రం ఒకింత భయాందోళనల్నే సెంట్రల్ బ్యాంక్ వ్యక్తం చేయడం గమనార్హం.
పరిస్థితులు ఇలాగే ఉంటే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కఠిన ద్రవ్యవిధానం, ద్రవ్యలభ్యత వంటివి బ్యాంకుల లాభాలు, ఆస్తులపై ప్రభావం చూపే వీలుందని ఈ సందర్భంగా ఆర్బీఐ అంచనా వేసింది. ‘ఈ ఏడాది ప్రపంచ వృద్ధి క్షీణించడం, వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశాలు పెరుగుతుండటం, ప్రధాన దేశాల్లో రుణాల వృద్ధి పతనం దిశగా పయనిస్తుండటం మధ్య బ్యాంకింగ్ రంగ లాభాలు పడిపోతాయనిపిస్తున్నది’ అని ఆర్బీఐ తమ తాజా నివేదికలో చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా తరలిపోతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న మారకపు రేట్లు, దిగజారుతున్న ఫారెక్స్ నిల్వలు, మసకబారుతున్న స్థూల ఆర్థిక వృద్ధి అవకాశాలు ఇబ్బందికరంగా మారాయన్నది. లోన్ రైటాఫ్లతోనే 2021-22లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు తగ్గాయని ఆర్బీఐ తెలిపింది.
పెరిగిన బ్యాంకింగ్ మోసాలు
రిజర్వు బ్యాంక్ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ బ్యాంకింగ్ మోసాలు ఆగడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 9,102 బ్యాంకింగ్ మోసాలు పెరిగాయని తాజాగా వెల్లడించింది. వీటి విలువ రూ.60,389 కోట్లు. క్రితం ఏడాది 7,358 మోసాలు జరగగా..వీటి విలువ రూ.1.37 లక్షల కోట్లు. మోసాల సంఖ్య పెరిగినప్పటికీ, విలువ పరంగా చూస్తే మాత్రం భారీగా తగ్గాయి.