Income Tax | న్యూఢిల్లీ, జూలై 17 : ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో చాలామంది రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) కోతల్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ నెల 23 (మంగళవారం)న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ సర్వేలో ఏకంగా 56 శాతం మంది ఆదాయ పన్నుల భారం నుంచి ఉపశమనాన్ని కోరుకుంటున్నట్టు తేలింది. నిజానికి ఇప్పటికే భారతీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు సైతం ఇదే అంశాన్ని మోదీ సర్కారు దృష్టికి తీసుకెళ్లాయి. మార్కెట్లో వినీమయ సామర్థ్యం, కొనుగోలు శక్తి పెరగడానికి పన్ను కోతలు దోహదం చేస్తాయని, జనాల చేతుల్లో మరింత నగదు ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని కోరాయి.
ఈసారి బడ్జెట్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా కూడా అడుగులు వేయాలని 37 శాతం మంది కోరుకుంటుండటం గమనార్హం. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, వాటిని పెంచడంపై బడ్జెట్ దృష్టిపెడితే బాగుంటుందని ఎకనామిక్ టైమ్స్ ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. అయితే గత రెండు పర్యాయాలతో పోల్చితే ఈ దఫా కేంద్రంలో మోదీ సర్కారుకు మెజారిటీ తగ్గిన సంగతి విదితమే. మిత్రపక్షాల మద్దతుతో గద్దెనెక్కాల్సి వచ్చింది. దీంతో ఈ బడ్జెట్లో ఇతర పార్టీల అభిప్రాయాలనూ బీజేపీ గౌరవించాల్సి వస్తున్నది. కాబట్టి పెద్దగా బడ్జెట్‌పై ఆశలు పెట్టుకోవద్దన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పన్ను తగ్గింపులకు ఇక ఆస్కారం లేదని చెప్పడం గమనార్హం. ట్యాక్స్‌పేయర్లు తమకు ఏది లాభమో తెలుసుకుని కొత్త, పాత పన్ను విధానాలను ఎంచుకోవాలంటూ సూచించారు.
బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం హేతుబద్ధం చేయాలని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కోరింది. ఇది దేశంలో ఉక్కు, సోలార్ బ్యాటరీ, అల్యూమినియం, లిథియం సెల్స్ తయారీకి ఊతమివ్వగలదని ఐసీసీ అధ్యక్షుడు అమేయ ప్రభు అన్నారు. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఆయా ముడి సరకులపై సుంకాలు భారంగా పరిణమించాయన్నారు. ఇదిలావుంటే తయారీ రంగంలో కొత్త కంపెనీల కోసం గతంలో ప్రకటించిన లాభదాయక పన్ను విధానాన్ని పొడిగించాలని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంటున్నది.