PAN-Aadhar | ఆధార్ కార్డుతో పాన్ కార్డ్‌ను అనుసంధానం చేయని పన్ను చెల్లింపు దారులకు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆదాయం పన్నుశాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో తాజా అప్డేట్లో`2017 మే 11న జారీ చేసిన నోటిఫికేషన్ 37/2017 ప్రకారం మినహాయింపు లేని పాన్ కార్డు దారుల్లో ఆధార్‌తో అనుసంధానించని వారంతా తక్షణం లింక్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనుసంధానం చేయని పాన్ కార్డులు ఇన్ఆపరేటివ్`గా మారతాయని పేర్కొంది.
పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ 2023 మార్చి 31. ట్విట్టర్ అధికారిక ఖాతాలోనే ఇదే హెచ్చరికలు జారీ చేసింది. ఇన్‌కం టాక్స్ యాక్ట్-1961 ప్రకారం పాన్ కార్డు దారులంతా ఆధార్ కార్డును అనుసంధానించాల్సిందేనని ఐటీ డిపార్ట్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ స్పష్టం చేసింది.
2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ లింక్డ్ పాన్ కార్డ్ ఇన్ ఆపరేటివ్‌గా మారుతుంది. గడువు రోజురోజుకు దగ్గర పడుతున్నది. ఆలస్యం చేయొద్దు. ఈ రోజే లింక్ చేయండంటూ ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఇప్పుడు పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానానికి రూ.1000 జరిమాన చెల్లించాల్సి ఉంటుంది.