Belated ITR | మీరు గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..?! అలాగని చింతించాల్సిన అవసరం లేదు. జనవరి 15 వరకూ బీలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఆదాయం పన్ను విభాగం గడువు పొడిగించింది. గత ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత అంచనా సంవత్సరం 2024-25) రివైజ్డ్ ఐటీఆర్ లేదా బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి సాధారణంగా డిసెంబర్ 31తో గడువు ముగుస్తుంది.
కానీ, రెసిడెంట్ ఇండివిడ్యూయల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీలేటెడ్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి 2024 డిసెంబర్ 31 నుంచి 2025 జనవరి 15 వరకూ పొడిగిస్తున్నట్లు ఆదాయం పన్ను విభాగం మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. 2024 జూలై నెలాఖరులోగా ఐటీఆర్ దాఖలు చేసిన వారు కూడా తమ రికార్డుల్లో తేడాలు ఉంటే సవరించుకుని డిసెంబర్ 31 వరకూ రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
బీలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసే వారు రూ.5 లక్షల్లోపు ఆదాయం కల వారు రూ.1000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కల వారు రూ.5000 వరకూ జరిమాన చెల్లించాలి. ఇక రివైజ్డ్ లేదా బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేవారు కొత్త ఆదాయం పన్ను విధానంలోనే ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.