న్యూఢిల్లీ: ఆదాయం పన్ను(Income Tax) శాఖ కీలక ప్రటకన చేసింది. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఫైలింగ్ తేదీ గడువును పెంచారు. 2025-26 సీజన్ కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం జూలై 31 నుంచి గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పెంచినట్లు ఐటీశాఖ చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఐటీఆర్ దాఖలు విషయంలో విస్తృత స్థాయిలో మార్పులు జరిగాయని, అయితే కొత్త తరహా ఐటీఆర్‌ను తెలుసుకునేందుకు గడువును పెంచుతున్నట్లు ఐటీశాఖ పేర్కొన్నది. పన్నుదారులకు సరళమైన రీతిలో ఫైలింగ్ జరిగేందుకు గడువును పెంచుతున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే జూలై 31 వరకు ఉన్న ఐటీఆర్ ఫైలింగ్ తేదీని సెప్టెంబర్ 15కు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది.