న్యూఢిల్లీ, మే 18: భారత్లో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటించింది. 2030కల్లా 12.7 బిలియన్ డాలర్లు (రూ.1,05,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయాలన్న ప్రణాళికను ఏడబ్ల్యూఎస్ గురువారం వెల్లడించింది. తమ ప్రతిపాదిత డాటా సెంటర్ ఇన్ఫ్రాతో భారత్ వాణిజ్య సంస్థలో ప్రతీ ఏటా 1,31,700 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది.
డాటా సెంటర్ సప్లయ్ చైన్లోని కన్స్ట్రక్షన్, ఫెసిలిటీ మెయింటేనెన్స్, ఇంజనీరింగ్, టెలికమ్యునికేషన్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలుంటాయని వివరించింది. 2016 -2022 మధ్యకాలంలో ఏడబ్ల్యూఎస్ భారత్లో 3.7 బిలియన్ డాలర్లు (రూ.30,900 కోట్లు) ఇన్వెస్ట్ చేయగా, 2030కల్లా ఈ పెట్టుబడులు 16.4 బిలియన్ డాలర్లకు (రూ.1, 36,500 కోట్లు) చేరుకుంటాయి. తాము చేసే పెట్టుబడులతో 2030నాటికి దేశ జీడీపీకి 23.3 బిలియన్ డాలర్ల (రూ.1,94,700 కోట్లు) తోడ్పాటు అందుతుందని ఏడబ్ల్యూఎస్ విడుదల చేసిన ప్రకటన వివరించింది.