అమెరికా సుంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణల మధ్య త్రైమాసిక జీడీపీ వృద్ధి, జీఎస్టీ సంస్కరణలతో దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి నుంచి తేరుకున్నాయి. ఈ క్రమంలోనే గతవారం సెన్సెక్స్ 1,193.94 పాయింట్లు బలపడి 81,904.70 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 373 పాయింట్లు కోలుకుని 25,114 దగ్గర నిలిచింది. అయితే ఈ వారం మార్కెట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష నిర్ణయాల ప్రభావం ఎక్కువగా కనిపించే వీలున్నది. ఇక జీఎస్టీ కోతలతో ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ఆకర్షణీయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆటో షేర్లకూ గిరాకీ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న రూపాయి మారకం విలువ.. ట్రేడింగ్‌పై ప్రభావం చూపవచ్చన్న అంచనాలూ కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే నష్టాలకు ఆస్కారం ఉన్నది. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,400-25,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు.