న్యూయార్క్/వాషింగ్టన్, ఏప్రిల్ 22 : ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగానే నమోదు కావచ్చని మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 3 నెలల క్రితం ఈ అంచనా 6.5 శాతంగా ఉండటం గమనార్హం. వాణిజ్య యుద్ధం భయాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులే జీడీపీ వృద్ధి అంచనాల్లో కోతలకు కారణమని తమ ‘ప్రపంచ ఆర్థిక తీరుతెన్నులు’ నివేదికలో ఐఎంఎఫ్ పేర్కొన్నది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను జీడీపీ అంచనాను కూడా 6.2 శాతంగానే ఉంచింది. దేశ ఆర్థిక వృద్ధికి ప్రైవేట్ కన్జంప్షన్, ముఖ్యంగా గ్రామీణుల కొనుగోలు సామర్థ్యం కీలకమని వ్యాఖ్యానించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల సెగ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ గట్టిగానే తగులుతున్నదని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఈ టారిఫ్లతో కమ్ముకున్న అనిశ్చిత వాతావరణం.. వరల్డ్ ఎకానమీపై పెద్ద ఎత్తునే ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది 2.8 శాతంగానే ఉండొచ్చన్నది. గతంతో పోల్చితే ఇది అర శాతం(మునుపు 3.3 శాతం) తక్కువ. ఇక వచ్చే ఏడాదికి వృద్ధిరేటును 3 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. గతంలో ఇది కూడా 3.3 శాతంగానే ఉండేది. కెనడా, జపాన్, బ్రిటన్, అమెరికా జీడీపీ అంచనాలకు కోత పెట్టిన ఐఎంఎఫ్.. స్పెయిన్ వృద్ధి అంచనాను మాత్రం పెంచింది. ఈ ఏడాది అమెరికా జీడీపీ వృద్ధిరేటు 1.8 శాతానికే పరిమితం కావచ్చన్నది. ఇదే సమయంలో చైనా ఆర్థిక వృద్ధిరేటు 4 శాతంగా ఉండొచ్చన్నది. గతంతో పోల్చితే అమెరికా వృద్ధి అంచనాకు 0.9 శాతం, చైనా జీడీపీ అంచనాకు 0.6 శాతం చొప్పున కోతలు పడ్డాయి. అయినప్పటికీ అమెరికాలో మాంద్యం తలెత్తకపోవచ్చన్నది.
ప్రతీకార సుంకాల నుంచి ప్రపంచ దేశాలకు మినహాయింపునిచ్చిన అమెరికా.. చైనాపై మాత్రం అమలు చేస్తున్నది. దీంతో డ్రాగన్ సైతం అగ్రరాజ్యంపై పెంచిన టారిఫ్లను వర్తింపజేస్తున్నది. దీంతో రెండు ప్రధాన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం సహజంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలిపీఠంపై నిలబెడుతున్నది. 90 రోజులపాటు టారిఫ్లకు విరామం ఇచ్చిన ట్రంప్.. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నారు. అయితే చైనా ఢీ అంటే ఢీ అంటుండటంతో చర్చలకు ట్రంప్ సంకేతాలిస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వరల్డ్ ఎకానమీకి ఓ ఆశా కిరణంగానే కనిపిస్తున్నది. ప్రస్తుతం అమెరికాలోకి దిగే చైనా వస్తూత్పత్తులపై 145 శాతం సుంకాలు పడుతున్నాయి. అలాగే చైనాలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై 125 శాతం సుంకాలున్నాయి.