న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రముఖ ఫర్నీచర్ ఉత్పత్తుల విక్రయ సంస్థ ఐకియా ఇండియా భారీ నష్టాలను చవిచూసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,299.40 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం మాత్రం ఏడాదిప్రాతిపదికన 4.5 శాతం ఎగబాకి రూ.1,809.8 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. వ్యాపారాన్ని విస్తరించడానికి అధికంగా నిధులు వెచ్చించడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులలో అవుట్లెట్లు ఉన్నాయి. వీటికోసం ప్రకటనల రూపంలో రూ.196.3 కోట్ల నిధులను వెచ్చించింది.
31 వరకు వివాద్ సే విశ్వాస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పన్ను బకాయిలు, వడ్డీ, జరిమానా మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివాద్ సే విశ్వాస్ స్కీం గడువును జనవరి 31 వరకు పెంచుతూ ఆదాయ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 31లోపు పన్ను చెల్లింపుదారులు పూర్తిగా తమ బకాయిలు చెల్లించాలని గతంలో ఆదేశించింది. దీంట్లో వడ్డీ, జరిమానాను పూర్తిగా ఎత్తివేస్తున్నారు. సోమవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తాజా నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి పన్ను చెల్లింపుదారులు 110 శాతం బకాయిలు, వడ్డీ, జరిమానాతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.