న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు గత నెలలో 5 నెలల కనిష్ఠానికి పతనమైంది. మార్చిలో 4.1 శాతానికే పరిమితమైంది. తయారీ రంగంలో ప్రగతి మందగించడమే ఇందుకు కారణమని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరసించిన విద్యుత్తు రంగం కూడా ఐఐపీ వృద్ధికున్న అవకాశాలను దెబ్బతీసింది.
నిరుడు అక్టోబర్ తర్వాత..
గత ఏడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధిరేటు 0.5 శాతంగానే ఉన్నది. మళ్లీ ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలోనే తక్కువగా నమోదైంది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో 5.1 శాతంగా ఉన్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) లెక్కలు చెప్తున్నాయి. నిజానికి మొదట్లో 5.2 శాతంగా దీన్ని అంచనా వేశారు. ఆ తర్వాత సవరించారు. అయినప్పటికీ నెల రోజుల్లో 1 శాతం వృద్ధి క్షీణించినైట్టెంది. ఇక నిరుడు మార్చిలో ఐఐపీ ప్రగతి 3.9 శాతంగా ఉన్నది. దీన్నిబట్టి చూస్తే ఏడాది కాలంలో స్వల్పంగానే పెరిగినైట్టెంది. ఇదిలావుంటే ఐఐపీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం కార్యకలాపాలు ఈ మార్చిలో 4.3 శాతం వృద్ధిని చూపుతున్నాయి. మొత్తం 23 ఇండస్ట్రీ గ్రూపుల్లో 9 ప్రతికూల వృద్ధిలోనే ఉన్నాయి. అలాగే విద్యుత్తు రంగంలో వృద్ధిరేటు 7.5 శాతం నుంచి 0.8 శాతానికి దిగజారింది. దీంతో తయారీ రంగం కార్యకలాపాలు పెద్దగా పెరుగకపోవడం, విద్యుత్తు రంగం మందగమనం దిశగా నడువడం.. ఐఐపీ వృద్ధిని ప్రధానంగా అడ్డుకున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైనింగ్ రంగంలో ఉత్పాదకత 1.2 శాతం నుంచి 5.5 శాతానికి ఎగసినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తంగా చూసినైట్టెతే ఐఐపీ వృద్ధి స్వల్పంగా పెరిగింది. 4.1 శాతంగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) ఇది 4 శాతంగా ఉన్నట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి.
యుద్ధం ప్రభావం..
గల్ఫ్ యుద్ధం.. భారత్‌ను గట్టిగానే ప్రభావితం చేస్తున్నది. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. అందులో ఎక్కువ భాగం సౌదీ, ఖతార్, కువైట్, యూఏఈ తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో ఆయా దేశాల్లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అమెరికాకు అండగా ఉంటున్నాయని ఇరాన్ పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఆయా దేశాల్లోని చమురు ఉత్పాదక కేంద్రాలు తీవ్రంగానే దెబ్బతిన్నాయి. దీనికితోడు హొర్ముజ్ జలసంధిలో రవాణాకు ఇబ్బందులు తలెత్తడం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తెచ్చిపెడుతున్నది. డిమాండ్‌కు తగ్గ చమురు, సహజ వాయువు సరఫరా లేక.. అనుబంధ రంగాలు కుదేలవుతున్నాయి. పెరిగిన రవాణా వ్యయంతో వివిధ వస్తూత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి.. మార్కెట్లో అమ్మకాలను దెబ్బతీస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఉత్పాదక రంగంలో అన్నింటికీ ఆయిల్ జీవనాధారం కావడంతో.. మందగమనం ఛాయలు అలుముకున్నాయి. మొత్తానికి 2 నెలలుగా జరుగుతున్న వార్ (ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలైంది)తో భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు దిగాలుపడ్డాయి.