EPF UAN No | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లోని ఈపీఎఫ్ ఖాతాదారులకు యూఏఎన్ నంబర్ చాలా కీలకం. తమ సంస్థలో సభ్యులుగా ఉన్న వారికి ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కేటాయించే 12 అంకెల నంబర్ ఈ యూఏఎన్ నంబర్. దీంతో ఈపీఎఫ్ఓ సభ్యులు ఆన్ లైన్ లో తమ ఈపీఎఫ్ ఖాతాకు తేలిగ్గా లాగిన్ కావచ్చు. తమ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. యూఏఎన్ నంబర్ కార్డు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్లోనే వ్యక్తిగత వివరాలు, కేవైసీ, బ్యాంకు ఖాతా డిటైల్స్ అప్ డేట్ చేసుకోవడం తేలిక. వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నా.. వాటిని ఒక ఖాతాలోనే విలీనం చేసేసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు ఆన్ లైన్లోనే క్లయిమ్ లు దాకలు చేయొచ్చు. ఇలా పలు రకాల బెనిఫిట్లు అందించే యూఏఎన్ నంబర్ మీ వద్ద లేకపోయినా తిరిగి తెలుసుకోవడం తేలిక. సదరు యూఏఎన్ నంబర్ యాక్టివ్‌గా ఉండటంతోపాటు మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి.
మీ యూఏఎన్ నంబర్ epfo.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. అందుకోసం తొలుత ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ‘సర్వీసెస్’ సెక్షన్ కు వెళ్లాలి. ఇక్కడ ‘ఫర్ ఎంప్లాయీస్’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ‘యూఏఎన్ సభ్యుడు /ఆన్ లైన్ సర్వీస్’పై క్లిక్ చేయాలి. దీంతో మీరు unifiedportal-mem.epfindia.gov.in పోర్టల్‌కు రీ డైరెక్ట్ అవుతారు.
ఇక్కడ ‘ఇంపార్టెంట్ లింక్స్’లో అందుబాటులో ఉన్న ‘నో యువర్ యూఏఎన్’ మీద క్లిక్ చేయాలి. అటుపై మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ నంబర్ నమోదు చేసి, రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్ నంబర్ కు లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది. దీన్ని నమోదు చేస్తే, మీ యూఏఎన్ నంబర్.. ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది.
యూఏఎన్ నంబర్ యాక్టివ్‌గా ఉన్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ నుంచి 77383 99899 ఫోన్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపి.. యూఏఎన్ నంబర్, ఖాతాలో బ్యాలెన్స్ డిటైల్స్ తెలుసుకోవచ్చు. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లో ఎస్సెమ్మెస్ పొందేందుకు EPFOHO UAN అని నమోదు చేసి 77382 99899 ఫోన్ నంబర్ కు ఎస్సెమ్మెస్ పంపాలి.
ప్రాంతీయ భాషల్లో ఎస్సెమ్మెస్ పొందాలని కోరుకుంటే.. సంబంధిత భాషలో తొలి మూడు అక్షరాలు టైప్ చేయాలి. తెలుగులో అయితే EPFOHO UAN TEL అని టైప్ చేసి ఎస్సెమ్మెస్ పంపితే.. ఈపీఎఫ్ఓలో మీ చివరి కంట్రీబ్యూషన్, ఖాతా బ్యాలెన్స్, యూఏఎన్ నంబర్, పీఎఫ్ బ్యాలెన్స్ తదితర వివరాలతో మీకు ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈపీఎఫ్ఓ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే మీ యూఏఎన్ నంబర్, మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.