Rahul Gandhi | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలపై లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెబీ చైర్ పర్సన్‌గా మాధాబి పురీ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ పోస్ట్ లో ప్రశ్నించారు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదకు రక్షణ కల్పించాల్సిన స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’.. తమ చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల విషయమై రాజీ పడిందని పేర్కొన్నారు.
‘ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఆ మ్యాచ్ వీక్షించే ప్రతి వ్యక్తికి మ్యాచ్ అంపైర్ రాజీ పడ్డారా లేదా? అన్న సంగతి తెలిసిపోతుంది. మ్యాచ్ లో ఏం జరుగుతుంది? పారదర్శకంగా జరిగే మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుంది. మ్యాచ్ లో పాల్గొనే కొందరు వ్యక్తుల గురించి.. ఆ మ్యాచ్ వీక్షించే మీరు ఎలా ఫీల్ అవుతారు. భారత స్టాక్ మార్కెట్లలోనూ సరిగ్గా అదే జరుగుతుంది’ అని రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.
సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని దేశంలోని నిజాయితీ గల ఇన్వెస్టర్లు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ఇన్వెస్టర్లు తాము ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము నష్టపోతే .. ప్రధాని మోదీ, సెబీ చైర్ పర్సన్. గౌతం అదానీల్లో ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తాజాగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్రమైన ఆరోపణలను సుప్రీంకోర్టు తిరిగి సుమోటోగా స్వీకరించి విచారిస్తుందా? అని అన్నారు. దీనిపై జేపీసీ విచారణకు ఆదేశించడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్థమైందన్నారు.