ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాంక్ పరిమితిపై వెనక్కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా తీసిన ఖతాదారులకు సేవింగ్ అకౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50వేల పరిమితిని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. ఆగస్టు నుంచి మెట్రోనగరాల్లో తెరిచిన సేవింగ్ అకౌంట్లపై పరిమితిని ఐదు రెట్లు పెంచింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్సైట్లో విడుదల చేసిన నోటీసుల్లో కస్టమర్ల నుంచి వచ్చిన విలువైన అభిప్రాయాల ఆధారంగా అంచనాలు, ప్రాధాన్యానికి అనుగుణంగా నిబంధనలు సవరించినట్లు తెలిపింది.
గతంలో సవరిస్తూ జారీ చేసిన ఉత్తర్వును సంహరించుకుంటున్నట్లు పేర్కొంది. మెట్రోల్లో రూ.15వేలు, పట్టణాల్లో రూ.7500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2500 కనీస బ్యాలెన్స్‌గా నిర్ణయించినట్లు తెలిపింది. అంతకు ముందు రూ.5వేలు, రూ,2వేలుగా ఉండేది. మునుపటి పరిమితితో పోలిస్తే కనీస బ్యాలెన్స్ పరిమితిని 50శాతం పెంచింది. కొత్త నిబంధనలు సాలరీ అకౌంట్స్, సీనియర్ సిజిటన్ అకౌంట్స్, పెన్షనర్స్, ప్రైమరీ సేవింగ్ డిపాజిట్ అకౌంట్స్‌కు వర్తించవని పేర్కొంది. అయితే, జులై 31కి ముందు తీసిన ఖాతాలపై కొత్త నిబంధనలు ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌తో సహా చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస మొత్తంపై జరిమానాను తొలగించడం, తగ్గించిన విషయం తెలిసిందే. మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఖాతాల్లో నిర్వహించాల్సిన కనీస మొత్తం. బ్యాలెన్స్ తక్కువగా ఉంటే బ్యాంకులు ఆరు శాతం.. గరిష్టంగా రూ.500 (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ నగదు లావాదేవీలకు సంబంధించిన రూల్స్‌ను మార్చింది. కస్టమర్లు నెలకు మూడుసార్లు ఉచితంగా నగదును డిపాజిట్ చేయొచ్చు. మొత్తం రూ.లక్ష వరకు ఉంటుంది. దాని కంటే ఎక్కువ డిపాజిట్లు, లావాదేవీలపై రూ.150 లేదంటే రూ.1000 డిపాజిట్ చేసినందుకు రూ.3.50 (ఏది ఎక్కువైతే అది) వసూలు చేయనున్నది.