Price Hike | న్యూఢిల్లీ, మార్చి 19: వాహన ధరలకు మళ్లీ రెక్కలువచ్చాయి. మరో రెండు సంస్థలు తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి హ్యుందా య్, హోండాలు కూడా చేరాయి. ఏప్రిల్ నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నాయి.
ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని ఇరు సంస్థలు ప్రకటించాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్ ఇండియా తన వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా మాడళ్లు మరింత ప్రియంకానున్నాయి.
ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు కమోడిటీ ధరలు, నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జనవరి నెలలో వాహన ధరలను రూ.25 వేల వరకు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంస్థ రూ.5.98 లక్షల నుంచి రూ.46.3 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. మరోవైపు, హోండా కార్స్ ఇండియా కూడా ధరలను సవరిస్తున్నట్లు తెలిపింది.