న్యూఢిల్లీ/ముంబై, అక్టోబర్ 9: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ భారీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభం కానున్నది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రూ.27,870 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వస్తున్నది. షేర్ ధరల శ్రేణిని రూ.1,865-1960గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లను ఆకట్టుకొనేందుకు సంస్థ రోడ్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పండుగ సీజన్లో కార్ల అమ్మకాలు బాగున్నాయన్నారు. అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావం ఏమీ లేదన్నారు. కాగా, యాంకర్ ఇన్వెస్టర్ల కోసం షేర్ల బిడ్డింగ్ 14నే మొదలవుతుంది. 17న ముగుస్తుంది. ఇక ఈ ఐపీవోతో ఇప్పటిదాకా భారీది గా పేరున్న ఎల్ఐసీ రూ.21,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ రెండో స్థానంలోకి వెళ్లనున్నది.
వచ్చే ఏడాది జనవరి-మార్చిలో నాలుగు విద్యుత్తు ఆధారిత వాహనాలను (ఈవీ) మార్కెట్‌కు హ్యుందాయ్ పరిచయం చేయనున్నది. ఆరంభ, గరిష్ఠ స్థాయి ధరల్లో వీటిని తీసుకురానున్నారు. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా మాడల్ కూడా ఉన్నట్టు సంస్థ ఎండీ ఉన్సూ కిమ్ తెలిపారు.