Hyundai Motor | పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్ లేదా డీజిల్ స్థానే వాహనాలు నడిచేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైనే అందరూ దృష్టిని కేంద్రీకరించారు. ఎలక్ట్రిక్, సీఎన్జీతోపాటు హైబ్రీడ్ మోడల్ వాహనాల తయారీకి ఆటోమొబైల్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లలో వాడే బ్యాటరీలు, వాహనాల విద్యుద్ధీకరణ రంగాల్లో సహకారాత్మక పరిశోధనా వ్యవస్థ రూపకల్పన కోసం దేశంలోని మూడు ఐఐటీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండాయ్ మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో 70 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నది.
బహుళ సెగ్మెంట్ల మొబిలిటీ వాహనాలు తయారు చేస్తున్న హ్యుండాయ్ మోటార్ గ్రూప్ ఈ మేరకు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ సంస్థలతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. 2025-2029 మధ్య 70 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నది హ్యుండాయ్ మోటార్ గ్రూప్ సంకల్పం. ఈ సహకార భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఢిల్లీ ఐఐటీలో ‘హ్యుండాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (హెచ్ఓఈ)’ ఏర్పాటు చేస్తుంది. హ్యుండాయ్ మోటార్ గ్రూప్ నుంచి ‘హెచ్ఓఈ’ స్పాన్సర్ షిప్ లు తీసుకొస్తుంది. భారత్ మార్కెట్కనుగుణంగా తయారు చేసే వాహనాల్లో అత్యాధునిక బ్యాటరీలు, విద్యుద్ధీకరణ వ్యవస్థల రూపకల్పనే ‘హెచ్ఓఈ’ ప్రధాన లక్ష్యంగా ఉంది.
హ్యుండాయ్ భారత్లో ప్రతిభావంతులైన నిపుణులతో కూడిన నెట్ వర్క్ ఏర్పాటు చేస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా దక్షిణ కొరియా, భారత్ మధ్య బ్యాటరీల తయారీకి సాంకేతికతతోపాటు నిపుణుల బదిలీకి చర్యలు తీసుకుంటుందని హ్యుండాయ్ ఆర్ అండ్ డీ ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ తెలిపారు. ఈ భాగస్వామ్యాలతో భారత్లో తన వ్యాపార లావాదేవీలను విస్తరించాలని హ్యుండాయ్ మోటార్ గ్రూప్ భావిస్తున్నది. మొబిలిటీ, స్టీల్, నిర్మాణ రంగం, లాజిస్టిక్, ఫైనాన్స్, ఐటీ, సర్వీస్ రంగాల్లో హ్యుండాయ్ మోటార్ గ్రూప్ సేవలందిస్తున్నది.