ముంబై, జూన్ 14: ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్ ఇండియా. .స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తున్నది. మెగా బాహుబలి ఐపీవోకి రావడానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకునే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీవో ద్వారా కనీసంగా 3 బిలియన్ డాలర్లు(రూ.25 వేల కోట్లు) నిధులను సేకరించాలని సంకల్పించింది. ఈ ఐపీవోకి సెబీ అనుమతిస్తే..దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీవో కానున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ సేకరించిన 2.7 బిలియన్ డాలర్లు అత్యధికం. అలాగే దేశీయ పారిశ్రామిక రంగంలో ఇదొక మైలురాయిలా నిలువనున్నదని, ముఖ్యంగా రెండు దశాబ్దాల తర్వాత ఐపీవోకి రాబోతున్న ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ కావడం విశేషం. ఈ ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 14 కోట్ల నుంచి 15 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని హ్యుందాయ్ యోచిస్తున్నది.
ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ కంట్రోల్ యూనిట్లో సాంకేతిక సమస్యలు రావడంతో 1,744 యూనిట్ల అయోనిక్5 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూలై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024లో తయారైన ఈ మాడళ్లలో 12వీ బ్యాటరీ డిచార్జి అవుతుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది.