Hyundai | కేంద్ర ప్రభుత్వ తీరుపై దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హ్యుండాయ్’ ఆందోళన వ్యక్తం చేసింది. ‘వాహనాల తయారీ విధానం’లో కేంద్ర ప్రభుత్వం తరుచుగా మార్పులు చేయడం వల్ల భారత్లోకి అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులు వేగంగా రాబోవని పేర్కొంది. హ్యుండాయ్.. త్వరలో తన భారత్ అనుబంధ ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’లో తన 17 శాతం వాటాను స్టాక్ మార్కెట్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కు అనుమతించాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’కి దరఖాస్తు చేసింది. ఐపీఓ ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల నిధులు సేకరించాలని హ్యుండాయ్ లక్ష్యంగా పెట్టుకున్నది.
1996లో భారత్లో కార్యకలాపాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ హ్యుండాయ్ దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. సుస్థిర ప్రభుత్వ విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అధునాతన టెక్నాలజీ అప్ గ్రేడ్స్ కస్టమర్లకు అందుబాటులోకి తేవాలంటే సుస్థిర ప్రభుత్వ మార్గదర్శకాలు కీలకం అని హ్యుండాయ్ పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ వార్తా కథనం ప్రచురితమైంది.
సమీప భవిష్యత్లో భారత్లో రూ.32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హ్యుండాయ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రీన్ టెక్నాలజీల కోసం మౌలిక వసతుల కల్పనతోపాటు ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణ, కార్ల ఉత్పత్తి పెంపొందించడానికి కొత్త పెట్టుబడులు వినియోగించాలని హ్యుండాయ్ భావిస్తున్నది. తమ ప్రథమ ప్రాధాన్యం ‘ఈవీ కార్ల’పైనే ఉంటుందని స్పష్టం చేసింది.