న్యూఢిల్లీ, జనవరి 2: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్..మరో ఈవీని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాను గురువారం ఈవీ రూపంలో ఆవిష్కరించింది. ఈ నెలలో జరగనున్న వాహన పండుగలో ఈ కారును ప్రదర్శించబోతున్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా.
దీంట్లో 51.4 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు మైలేజీ ఇవ్వనుండగా, 42 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 390 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దేశీయ మార్కెట్లోకి సంస్థ విడుదల చేసిన మూడో మాడల్ ఇదే కావడం విశేషం. టాటా కర్వ్.ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతి ఈ-విటారా, బీవైడీ ఆటో 3లకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని విడుదల చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.