Hyundai EXTER | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) వచ్చేనెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న లేటెస్ట్ ఎస్యూవీ.. హ్యుండాయ్ ఎక్స్టర్ (Hyundai EXTER) ఉత్పత్తి ప్రారంభమైంది. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్రొడక్షన్ యూనిట్లో శుక్రవారం ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.
రేంజర్-ఖాకీ (Ranger-Khaki) రంగులో ఎక్స్టర్ (Hyundai EXTER) తయారవుతున్నది. 700 మందికిపైగా ఫోర్త్ జనరేషన్ రోబోలు, అత్యంత నిపుణులైన హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్మికుల ఆధ్వర్యంలో ఎక్స్టర్ ((Hyundai EXTER) కార్ల ఉత్పత్తి ప్రారంభించామని కంపెనీ ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ తెలిపారు.
ఎక్స్టర్తో హ్యుండాయ్ నూతన సెగ్మెంట్లోకి ఎంటరవుతున్నది. దీంతో ఎస్యూవీ కార్ల తయారీలో పూర్తిస్థాయిలో విస్తరణకు సిద్ధమైందని ఉన్సూ కిమ్ ఓ ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ ఎలక్ట్రిక్ రూఫ్, ఇన్ బిల్ట్ డాష్ కామ్ విత్ డ్యుయల్ కెమెరాలు తదితర ఫీచర్లు ఉన్నాయి. మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్టర్ తొలి మోడల్ కానున్నది. బ్లూలింక్ టెక్నాలజీ ద్వారా 60 ప్లస్ కనెక్టెడ్ ఫీచర్లు జత కలుస్తాయని భావిస్తున్నారు.
వివిధ సెగ్మెంట్లలో హ్యుండాయ్ 12 కార్లు విక్రయిస్తున్నది. దేశవ్యాప్తంగా 1348 సేల్స్ పాయింట్లు, 1515 సర్వీస్ పాయింట్లతో కస్టమర్లకు సేవలందిస్తున్నది. 85 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నది.