Hyderabad – Home Sales | రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్లు చాలా సున్నితం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రగతిలో రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషించనుంది. అయితే, ఈ రంగాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక రంగ సంక్షోభం, కరోనా మహమ్మారి వంటి అంశాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇబ్బందులు తలెత్తినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిశ్శబ్దంగా ప్రగతి పథంలో దూసుకెళ్లింది. కానీ 2024లో పరిస్థితి చాలా విచారకరంగా మారిందని తెలుస్తోంది. ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో ఇండ్ల విక్రయాలు ఏడు శాతం, నెలవారీ సేల్స్ మూడు శాతం తగ్గాయని పేర్కొంది. ఏడాదిలో 12 శాతం, నెల వారీగా ఆరు శాతం ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని వెల్లడించింది. డిమాండ్ తగ్గడంతో పలువురు బిల్డర్లు తమ ప్రాజెక్టుల భవితవ్యం పట్ల ఆందోళనతో డైలమాలో పడుతున్నారు.
2023 నవంబర్ నెలలో 6,268 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ ఏడాది 5,516 యూనిట్లకు పరిమితం అయ్యాయి. దీని ప్రకారం 12 శాతం ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 2023లో ఇండ్ల విక్రయాల విలువ రూ.3,741 కోట్లయితే, ఈ ఏడాది రూ.3,495 కోట్లు మాత్రమే. అంటే ఇండ్ల విక్రయాల విలువ మూడు శాతం తగ్గింది. ఓవరాల్గా ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గినా లగ్జరీ ఇండ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం పెరిగాయి. ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టూ ఉన్న హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లగ్జరీ ఇండ్ల రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి.
హైదరాబాద్ నగర పరిధిలో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లలో అత్యధికం రూ.50 లక్షల్లోపే. ఇటీవలి కాలంలో రూ.కోటి, అంత కంటే ఎక్కువ ధర ఇండ్ల రిజిస్ట్రేషన్లు 12 శాతం నుంచి 14 శాతానికి పెరిగాయి. ఇండ్ల కొనుగోలు దారులు అధిక విలువ గల ఇళ్ల వైపే మొగ్గుతున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలో 42 శాతం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగితే, రంగారెడ్డిలో 41 శాతం, హైదరాబాద్ లో 17 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.