Hyderabad | న్యూఢిల్లీ, జూలై 14: సంస్థాగత మదుపరులకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదలు భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతూ వస్తున్నారు. అటు ఆఫీస్ మార్కెట్, ఇటు హౌజింగ్ మార్కెట్ రెండింటిలోనూ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు కొనసాగుతుండటం విశేషం. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య దాదాపు రూ.1,050 కోట్ల పెట్టుబడులు (127.3 మిలియన్ డాలర్లు) వచ్చినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ కొల్లీర్స్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన తమ తాజా నివేదికలో తెలియజేసింది. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే పెట్టుబడులు ఎన్నో రెట్లు పెరిగాయని పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా..
ఈ జనవరి-జూన్‌లో హైదరాబాద్‌సహా యావత్తు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి సంస్థాగత మదుపరుల ద్వారా వచ్చిన పెట్టుబడులు సుమారు రూ.30,405 కోట్లు (3.7 బిలియన్ డాలర్లు)గా నమోదయ్యాయి. నిరుడు జనవరి-జూన్‌తో పోల్చితే 43 శాతం పెరిగాయి. ఇక ఈసారి పుణె రియల్టీ మార్కెట్లోకి అత్యధికంగా 1.12 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం జరిగిందని కొల్లీర్స్ చెప్పింది. అలాగే బెంగళూరు 196.6 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని అందుకున్నది. అయితే చెన్నై, ముంబై మార్కెట్లలోకి 69 శాతం, 17 శాతం చొప్పున సంస్థాగత పెట్టుబడులు పడిపోయాయని కొల్లీర్స్ రిపోర్టు వెల్లడించింది.
ఆఫీస్ మార్కెట్‌దే హవా
ఈ జనవరి-జూన్‌లో దేశంలోకి వచ్చిన మొత్తం 3.7 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడుల్లో ఆఫీస్ మార్కెట్లోకే 2.7 బిలియన్ డాలర్లు వెళ్లాయి. నిరుడుతో పోల్చితే రెట్టింపునకుపైగా పుంజుకోవడం గమనార్హం. హౌజింగ్ మార్కెట్లోకి 433.4 మిలియన్ డాలర్లే వచ్చాయి. అయినప్పటికీ గతంతో పోల్చితే దాదాపు 5 రెట్లు వృద్ధి ఉండటం విశేషం. ఇక మల్టీ-సిటీ డీల్స్ 1.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కొల్లీర్స్ తెలియజేసింది.