న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 7: నివేదిక ఏదైనా చెప్తున్నది మాత్రం ఒక్కటే. అదే.. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు ఆదరణ పడిపోయిందన్నది. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సైతం ఇదే స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రథమార్ధానికి (జనవరి-జూన్)గాను హైదరాబాద్‌సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లోగల కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఓ రిపోర్టును సోమవారం విడుదల చేసింది. ఇందులో గత ఏడాది జనవరి-జూన్‌తో పోల్చితే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ 6 శాతం క్షీణించినట్టు తేలింది. కాగా, గత 6 నెలలుగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె, కోల్‌కతా నగరాల్లోని కార్యాలయ స్థలాల లీజింగ్ వివరాలను ఈ సందర్భంగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వెల్లడించింది. అయితే ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె, చెన్నై మినహా మిగతా నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గినట్టు స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గర్నుంచి గడిచిన దాదాపు పదేండ్లపాటు నాటి సీఎం కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు జోరుగా సాగాయి. అందుకు అప్పటి గణాంకాలే నిదర్శనమవగా.. తీసుకున్న అన్ని నిర్ణయాలు ఈ ప్రగతికి దోహదం చేశాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిస్థితులూ మారిపోయాయి. మార్కెట్లో నెలకొన్న మందగమనం.. ఆఫీస్ స్పేస్‌పై ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదిప్పుడు. నానాటికీ డిమాండ్ క్షీణిస్తున్నది. ఈ జనవరి-జూన్‌లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 4.3 మిలియన్ (43 లక్షలు) చదరపు అడుగులకే పరిమితమైంది. నిరుడు జనవరి-జూన్‌లో 4.6 మిలియన్ (46 లక్షలు) చదరపు అడుగులుగా ఉన్నదని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ గుర్తుచేస్తున్నదిప్పుడు.
టెక్నాలజీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నిలకడైన వృద్ధిని మేము చూస్తున్నాం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నుంచి డిమాండ్ పెరిగితే రికార్డుల్ని సృష్టించవచ్చు.
-అన్షుల్ జైన్, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో
ఆఫీస్ స్పేస్ కోసం వచ్చేవారు అత్యంత ప్రయోజనకరమైన కార్యాలయ స్థలాలను కావాలని చూస్తున్నారు. అయినప్పటికీ ప్రధాన ఏరియాల్లో ఆఫీస్ స్పేస్ దొరకడం లేదు. కార్యాలయాలను పెట్టేవారికి అన్ని వసతులున్న చోట స్థలాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉన్నది.
-వీరబాబు, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎండీ