హైదరాబాద్, ఫిబ్రవరి 11 : హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ నెలకొన్నది. 2030 నాటికి నగరంలో 200 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఉండనున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్స్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలానికి ఉన్న డిమాండ్‌లో ఒక హైదరాబాద్ నగరం వాటా 15 శాతంగా ఉన్నదని తెలిపింది.
టెక్నాలజీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, దీంతో ఇక్కడ ఆఫీస్ స్థలాలకు గిరాకీ పెరుగుతున్నదని వెల్లడించింది. 2014 నుంచి డిసెంబర్ 2024 నాటికి నగరంలో ఆఫీస్ స్థలాలు మూడింతలు డిమాండ్ పెరిగి 137 మిలియన్ల చదరపు అడుగులకు చేరుకున్నదని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాలు అంతకంతకు పెరగడం, అలాగే ప్రతిభ కలిగిన ఉద్యోగులు లభించడం, ఐటీ/ఐటీఈఎస్ ఎకోసిస్టమ్, జీసీసీల ఏర్పాటునకు హైదరాబాద్ అనువుగా ఉండటం, బీఎఫ్ఎస్ఐ, లైఫ్ సైన్సెస్ అడ్డాగా కొనసాగుతుండటం కూడా మరో కారణమని చెప్పారు.