హైదరాబాద్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ.. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తర్వాతి తరం ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందంతో మారుబెనీ సంస్థ ప్రతినిధులు గురువారం టోక్యోలో సమావేశమయ్యారు. ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
దాదాపు రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ నెక్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టును చేపట్టనున్నది. ఇదిలావుంటే దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచస్థాయి, నెక్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్ను అభివృద్ధి చేసేందుకు కంపెనీ ప్రతిపాదనలు తయారు చేసుకున్నది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక్కడ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి సారించనున్నది. దీంతో దాదాపు 30వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాల అంచనాగా ఉన్నది.