హైదరాబాద్/బెంగళూరు, సెప్టెంబర్ 16: టెక్నాలజీ జాబ్ మార్కెట్లో బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీనిస్తున్నది. సీనియర్ ఇంజినీర్లకు, కొత్త బృందాల నిర్మాణానికి దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకుంటున్నాయి మరి. దీంతో డాటా ఇంజినీరింగ్, కృత్రిమ మేధస్సు (ఏఐ), రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) విభాగాలకు కేరాఫ్ అడ్రస్‌గా విరాజిల్లుతూ వస్తున్న బెంగళూరుకు హైదరాబాద్ వేగంగా ప్రత్యామ్నాయమవుతున్నదిప్పుడు. హైదరాబాద్‌కు సీనియర్ స్థాయి ఉద్యోగులను కంపెనీలు పంపుతున్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
బెంగళూరుతో పోల్చితే ఆయా ఉద్యోగుల వార్షిక జీతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా పెరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది 8.6 శాతం పెరిగి హైదరాబాద్‌లో రూ.30.4 లక్షలకు చేరాయి. బెంగళూరులో 5.6 శాతం వృద్ధితో రూ.33.8 లక్షలుగా ఉన్నాయని టీమ్‌లీజ్ సంస్థ తెలిపింది. అలాగే ఇంజినీరింగ్, ఆర్అండ్డీ ఉద్యోగుల వేతనాలు హైదరాబాద్‌లో 11.1 శాతం ఎగిసి రూ.20 లక్షలకు చేరితే, బెంగళూరులో 6.5 శాతం పెరిగి రూ.24.5 లక్షలుగానే ఉన్నాయి.
ఇక వేగంగా పెరుగుతున్న జీతాలు, భారీ సాలరీ ప్యాకేజీలేగాక.. జీవనశైలి, నివాసయోగ్యత కూడా బాగుండటం, ఖర్చులు తక్కువగా ఉండటం హైదరాబాద్పట్ల ఉద్యోగుల్లో డిమాండ్‌ను పెంచుతున్న అంశాలుగా నిలుస్తున్నాయని ఉద్యోగ నియామకాల కన్సల్టెన్సీ సంస్థ అడెకో భారతీయ మేనేజర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లాభాలు, ఇతరత్రా సదుపాయాలు చిన్న కంపెనీలనూ ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, జేపీమోర్గాన్, డీబీఎస్ బ్యాంక్, బాష్, హ్యుందాయ్ మొబిస్, ఈస్ట్‌మన్ కెమికల్, మెటా, గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థలు తమ హైదరాబాద్ సెంటర్లను ఏఐ ఆర్అండ్డీ ల్యాబ్‌లుగా రూపాంతరం చేస్తున్నాయి. క్వాల్కామ్, మైక్రాన్, వెరిజోన్, ఏబీబీ వంటి అమెరికా, స్విస్ కంపెనీలతోపాటు ఎల్అండ్టీ వంటి దేశీయ సంస్థలూ హైదరాబాద్‌లో కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నాయి.
-శ్రీని వడ్డెపల్లి, హెచ్ఎఫ్ఎస్ రిసెర్చ్